‘బ్యాక్‌ప్యాక్‌’ హీరోలు!

APOPO Rats In Their Life Saving Missions - Sakshi

ఈసారి ప్రపంచంలో ఎక్కడైనా భారీ భూకంపం సంభవిస్తే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరికొత్త ‘హీరోలు’రంగంలోకి దిగనున్నారు! వీపుపై మైక్రోఫోన్లు, వీడియో కెమెరాలు, లొకేషన్‌ ట్రాకర్‌లతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లు తగిలించుకొని చిన్నచిన్న రంధ్రాల్లోకి సైతం అలవోకగా దూసుకెళ్లనున్నారు!! హీరోలేమిటి.. రంధ్రాల్లోకి దూరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే.. కానీ ఈ హీరోలు ఆరడుగుల బుల్లెట్లు కాదు... కేవలం మన అరచేయికి కాస్త అటుఇటు సైజులో ఉండే ఎలుకలు!! 

ఇంతకీ విషయం ఏమిటంటే..
భూకంపాలు వచ్చినప్పుడు కుప్పకూలే భవనాల శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కచ్చితత్వంతో గుర్తించడం సహాయ సిబ్బందికి పెను సవాలే. దీనికితోడు సమయంతో పోటీపడాల్సి ఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, క్షతగాత్రులు శిథిలాల్లో ఎక్కడ చిక్కుకున్నారో కచ్చితత్వంతో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పనిని శునకాలు సైతం చేస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎలుకలు ఎన్నో రెట్లు చిన్నగా ఉండటం, చిన్నచిన్న ఖాళీ ప్రదేశాల్లోకి అలవోకగా వెళ్లే సామర్థ్యం ఉండటంతో ఇందుకోసం వాటిని ఎంచుకున్నారన్నమాట. 

ట్రైనింగ్‌లో ‘ర్యాట్‌’దేలుతూ..
టాంజానియాలోని మొరోగొరోలో ఎలుకలకు శిక్షణ ఇచ్చే అపోపో అనే ఎన్జీవో సంస్థతో కలసి శాస్త్రవేత్తలు సుమారు ఏడాదిగా పనిచేస్తున్నారు. తమ పరిశోధనకు హీరో ర్యాట్స్‌ అనే పేరుపెట్టారు. ప్రస్తుతం ఖాళీ బ్యాక్‌పాక్‌లతో వాటిని ‘డమ్మీ శిథిలాల్లో’కి వదిలి అక్కడ బాధితులెవరైనా కనపడగానే ఒక బటన్‌ నొక్కేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ‘బీప్‌’శబ్దం వినపడగానే ఎలుకలు తిరిగి తమ వద్దకు వచ్చేలా నేర్పుతున్నారు. ఎలుకల వీపులపై అమర్చే సాంకేతిక పరికరాలతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎలుకల బ్యాక్‌పాక్‌లలో సాంకేతిక పరికరాలను సిద్ధం చేశాక శిథిలాల్లోకి వెళ్లే ఎలుకలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్‌ ట్రాకర్‌ల ద్వారా గుర్తిస్తామని... అప్పుడు ఎలుకల వద్ద ఉండే మైక్రోఫోన్ల ద్వారా క్షతగాత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు చెందిన డాక్టర్‌ డోనా కీన్‌ చెప్పారు. ప్రస్తుతం ఏడు ఎలుకలకు శిక్షణ ఇచ్చామని... కేవలం రెండు వారాల్లోనే శిక్షణ వేగం పుంజుకుందని చెప్పారు.

త్వరలోనే మొత్తంగా 170 ఎలుకలను భూకంపాలు ఎక్కువగా సంభవించే టర్కీకి తరలించనున్నారు. ఎలుకల సాయంతో భూకంప శిథిలాల్లో గాలింపు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అంగీకరించడం విశేషం. ఇదంతా బాగానే ఉంది కానీ... మనమంటే మానవత్వం కోసం తోటివారిని కాపాడాలనుకుంటాం... మరి ఎలుకలు ఎందుకు మనుషులకు సాయం చేస్తాయనే డౌట్‌ మీకు వచ్చిందా? దానికీ ఓ ఆన్సరుంది. ఇలా శిథిలాల్లోకి వెళ్లి చెప్పిన పని చేసొచ్చే ఎలుకలకు రుచికరమైన ఆహారాన్ని సిరంజీల ద్వారా లంచంగా ఇస్తున్నారట. దీంతో ఎలుకలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మరికొన్ని ప్రమాదకర టాస్కుల్లోనూ... 
ల్యాండ్‌మైన్ల వంటి పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతోపాటు పశువులకు సోకే టీబీ, బ్రుసెల్లోసిస్‌ వంటి ప్రమాదకర రోగాలను కనిపెట్టడంలోనూ ఎలుకల సాయం తీసుకోవాలనుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పేలుడు పదార్థాల్లో ఉపయోగించే టీఎన్‌టీ (ట్రైనైట్రోటోల్యూని) లేదా టీబీ పాజిటివ్‌ నమూనాల వాసనలను ఎలుకలు పసిగట్టేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

శునకాలతో పోలిస్తే నామమాత్రమైన బరువుండే ఎలుకలు  పేలుడు పదార్థాలపై కాలుమోపినా పేలుళ్లు జరగవని... అలాగే శునకాల తరహాలోనే వాటి గ్రాహణ శక్తి కూడా అమోఘమని పేర్కొన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top