ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా! | America Changes Strategy: Trump Targets Kharg And Hormuz | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!

Mar 21 2026 7:03 AM | Updated on Mar 21 2026 8:29 AM

America Changes Strategy: Trump Targets Kharg And Hormuz

ఇరాన్‌పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్‌ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్‌కు తరలిస్తోంది. 31వ మరైన్‌ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.

దీంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్‌కు గుండెకాయ వంటి ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్‌ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్‌ను ఇరాన్‌ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్‌ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్‌ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్‌ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్‌ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్‌ నుంచే జరుగుతాయి.

ఖర్గ్‌ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్‌ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్‌ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్‌ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్‌ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్‌ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్‌ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్‌ దీవి ఇరాన్‌ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్‌ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement