అఫ్గాన్‌ను అల్లాడించిన భూ విలయం | Afghanistan Earthquake: 6.3 Magnitude Quake Kills 250, Tremors Felt in Delhi-NCR and J&K | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ను అల్లాడించిన భూ విలయం

Sep 1 2025 7:03 AM | Updated on Sep 2 2025 3:31 AM

6 0 Magnitude Earthquake Hits Afghanistan

6 తీవ్రతతో భూకంపం

800 మందికి పైగా మృత్యువాత

ఊళ్లు నేలమట్టం, కుప్పకూలిన వ్యవస్థలు

కొండ ప్రాంతమవడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

నత్తనడకన సహాయక చర్యలు

అండగా ఉంటాం: మోదీ

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ అల్లాడింది. దేశ తూర్పు ప్రాంతంలోని కూనూర్, నాన్‌ఘర్‌ ప్రావిన్సుల్లో ఆదివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి గ్రామాలకు గ్రామాలే నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి. 800 పై చిలుకు మంది మృత్యువాత పడగా 2,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం సంభవిస్తూనే ప్రభావిత ప్రాంతాల్లోని జనమంతా హాహాకారాలు చేస్తూ ఇళ్లనుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కానీ చాలామంది నిస్సహాయంగా శిథిలాల కింద చిక్కుబడ్డారు. 

మృతదేహాలను, గాయపడ్డవారిని సహాయక సిబ్బంది వెలికి తీస్తూ మార్చురీలకు, ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరిగే ఆస్కారముంది. కునార్, నంగర్హార్‌తో పాటు రాజధాని కాబూల్‌ నుంచి కూడా ప్రభుత్వ తదితర బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్‌ జమాన్‌ తెలిపారు. 

చాలా ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉందని తాలిబన్‌ సర్కారు ప్రధాన అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ అన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న అతి పెద్ద పట్టణమైన జలాలాబాద్‌ కూడా భూకంపానికి బాగా ప్రభావితమైంది. అది అఫ్గాన్‌లోకెల్లా అతి పెద్ద వర్తక కేంద్రాల్లో ఒకటి. పాక్‌కు సమీపంలో ఉండటంతో సరుకులు తదితరాల లభ్యత అత్యధికంగా ఉండటమే అందుకు కారణం. 

ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటలకు నాన్‌ఘర్‌ ప్రావిన్స్‌లో జలాలాబాద్‌కు ఈశాన్యాన 27 కి.మీ. దూరంలో 6.0 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి కేవలం 8 కి.మీ. లోతులో ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అమెరికా జియాలాజికల్‌ సర్వే పేర్కొంది. దాని తాలూకు ప్రకంపనలు ఏకంగా అసోం దాకా కనిపించాయి! తక్కువ లోతులో వచ్చే భూకంపాలు అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాయి. 2023 అక్టోబర్‌ 7న 6.3 తీవ్రతతో కూడిన భూకంపం అఫ్గాన్‌ను వణికించింది. ఆ ఉత్పాతానికి 4,000 మందికి పైగా బలయ్యారు. 


మూగవోయిన ఫోన్లు...
అఫ్గాన్‌లో అత్యధికం తక్కువ ఎత్తులో ఉండే నిర్మాణాలే. అందులోనూ కాంక్రీట్, నాటు ఇటుకతో చేసినవే. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా కారణమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగాఅసలే అంతంతమాత్రంగా ఉండే టెలిఫోన్‌ తదితర సమాచార వ్యవస్థలు భూకంపం దెబ్బకు పూర్తిగా కుప్పకూలాయి. దాంతో స్వదేశంలోని తమవారి క్షేమ సమాచారం తెలియక ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని వేలాది అఫ్గాన్లు అల్లాడుతున్నారు. 

భారత్‌ ఆపన్నహస్తం
అఫ్గాన్‌ భూకంప విలయంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఈ ఆపత్సమయంలో అన్నివిధాలా మానవీయ సాయం అందించేందుకు భారత్‌ సిద్ధమని ప్రకటించారు. ‘‘పొరుగు దేశంలో జరిగిన ప్రాకృతిక విపత్తు, అది చేకూర్చిన అపార ప్రాణ నష్టం చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ఇప్పటికే 15 టన్నుల ఆహార సామగ్రి తదితరాలను కాబూల్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం నుంచి కునార్‌కు పంపినట్టు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement