శవాలదిబ్బగా అఫ్ఘనిస్తాన్‌! | Afghanistan Earthquake Live Updates Latest Telugu News | Sakshi
Sakshi News home page

శవాలదిబ్బగా అఫ్ఘనిస్తాన్‌!

Sep 1 2025 12:40 PM | Updated on Sep 1 2025 2:07 PM

Afghanistan Earthquake Live Updates Latest Telugu News

భారీ భూకంపంతో అఫ్ఘనిస్తాన్‌ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 800 మందికి పైనే మరణించినట్లు అల్‌జజీరాతో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ దానిని ధృవీకరించింది. భూకంపంతో వేల మంది గాయపడినట్లు(1500 మందికిపైనే) అక్కడి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.  శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1, 2025 రాత్రి(ఆదివారం 11.47గం. సమయంలో) సమయంలో హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం పాకిస్థాన్ సరిహద్దులోని నంగర్హార్‌ ప్రావిన్స్‌ జలాలాబాద్‌ సమీపంలో  10 కి.మీ లోతులో నమోదైనట్లు తెలుస్తోంది. 

అఫ్గానిస్థాన్‌లోని కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్‌ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్‌ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి అని వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ ఓ పోస్టు పెట్టారు. 

ఘోర విపత్తు కారణంగా కునార్‌ ప్రావిన్స్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. పలు కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.

భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చలించిపోయానని క్రికెటర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ ఓ పోస్టు చేశారు. బాధితుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొండ ప్రాంతాల్లోని జనావాసాల్లో భూకంపం రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్పష్టమవుతోంది. భారీ పరిమాణంలోని కొండ రాళ్లు దొర్లిపడడంతో.. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు సమాచారం.

 

మరోవైపు.. ఈ ప్రకంపనలు 350 కిలోమీటర్ల దూరంలోనూ ప్రభావం చూపించాయి. ఫలితంగా.. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. అఫ్గనిస్తాన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి, ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండటంతో ఇది సాధారణమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement