ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు,  ధర అక్షరాల రూ. 1,117 కోట్లు

1955 Mercedes Benz 300 SLR Is The Most Expensive Car Sold In An Auction - Sakshi

వేలంలో కొత్త ‘బెంజ్‌’మార్క్‌

ఓ బ్రిడ్జిని కట్టేందుకు రూ. వెయ్యి కోట్లు కావాలి. పేద్ద లగ్జరీ హోటల్‌ కట్టాలంటే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి. చిన్న పథకం అమలు చేయాలన్నారూ. వెయ్యి కోట్లయితే కావాలి. అయితే  కొన్ని కొన్నిసార్లు కారు కొనాలన్నారూ. వెయ్యి కోట్లుండాలండోయ్‌. మీరు సరిగానే చదివారు. ఇటీవలి వేలంలో ఓ పాత కాలం బెంజ్‌ కారు అక్షరాలా రూ. వెయ్యి కోట్లపైనే పలికింది.

1955 నాటి 300 ఎస్‌ఎల్‌ఆర్‌ మర్సిడీజ్‌ బెంజ్‌  (ఉహ్లెన్‌హాట్‌) కారును మే 5న  ఆర్‌ఎమ్‌ సదబీజ్‌  సంస్థ వేలం వేస్తే ఒకాయన రూ. 1,117 కోట్లు పెట్టి కొన్నాడు. తద్వారా ఈ కారును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చేశాడు. గతంలోని రూ.500 కోట్ల రికార్డు (1963 నాటి ఫెరారీ 250 జీటీవో)ను తిరగరాశాడు. జర్మనీలోని స్టట్‌గాట్‌లో ఉన్న మర్సిడీజ్‌  మ్యూజి యంలో ఈ వేలమూ రహస్యంగానే జరిగింది.. కొన్నాయన పేరూ రహస్యంగానే ఉంది. 

రెండంటే రెండే కార్లు
300 ఎస్‌ఎల్‌ఆర్‌ కార్లను మర్సిడీజ్‌ బెంజ్‌ కంపెనీ రెండంటే రెండే తయారు చేసింది. రెండూ కూడా కంపెనీ దగ్గరే ఉన్నాయి. కంపెనీతో ఈ మాస్టర్‌ పీస్‌ను వేలం వేయించేందుకు 18 నెలలు పెద్ద లాబీయింగే జరిగిందట. ఎట్టకేలకు కంపెనీ ఒప్పుకోవడం, రహస్యంగా వేలం వేయడం చకచకా జరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కార్లను సేకరించే హాబీ ఉన్న వారు, కారును పెద్ద మొత్తం ధర పెట్టి కొనే వాళ్లలో 10 మందిని ఈ వేలం కోసం ఎంపిక చేశారట. వీరందరినీ ప్రైవేట్‌ జెట్‌లో వేలంకు తీసుకెళ్లారట.

వేలం కోసం  స్టట్‌గాట్‌లోని మ్యూజియంను వారం పాటు మూసేశారట. కారును కొనేవాళ్లు కొన్నేళ్ల వరకు దాన్ని అమ్మకుండా, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ కారును ప్రదర్శనకు తీసుకొచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. 

డబ్బుతో స్కాలర్‌షిప్‌లు
వేలంలో వచ్చిన డబ్బుతో ప్రపంచవ్యాప్త మర్సిడీజ్‌ బెంజ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చెప్పింది. పర్యావరణం, డీకార్బనైజేషన్‌పై పరిశోధన చేసే యువతకు స్కాలర్‌షిప్‌గా ఈ డబ్బును అందిస్తామని తెలిపింది. కంపెనీ దగ్గర ఉన్న రెండో కారును స్టట్‌గాట్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇంతకీ ఈ కారు పేరులో ఉహ్లెన్‌హాట్‌ ఎందుకు ఉందనుకుంటున్నారు? అప్పటి మెర్సెడెస్‌ టెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్, కారు సృష్టికర్త రుడాల్ఫ్‌ ఉహ్లెన్‌హాట్‌ వీటిల్లో ఓ కారును కంపెనీ కారుగా వాడారు. అందుకే ఈ కార్లను ఉహ్లెన్‌హాట్‌ కార్లు అని పిలుస్తున్నారు.
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

ఈ కారు ప్రత్యేకతలేంటి? 
►1955లో రెండంటే రెండే కార్లను తయారు చేశారు. చూడటానికి రేసింగ్‌ కారులా ఉంటాయి. వీటికి పైకి తెరుచుకునే గల్‌వింగ్‌ డోర్లు ఉన్నాయి. బాడీని అల్యూమినియంతో చేశారు. 
►మూడు లీటర్ల స్ట్రైట్‌ 8 సిలిండర్‌ ఇంజిన్‌తో నడుస్తాయి. 
►అత్యధిక వేగం గంటకు 286 కిలోమీటర్లు. బరువు 1,117 కిలోలు.
►పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.74 మీటర్లు, ఎత్తు 1.21 మీటర్లు.
►300 ఎస్‌ఎల్‌ఆర్‌ బెంజ్‌.. రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కార్‌ రేసులను గెలిచింది. సరాసరి గంటకు 157 కిలోమీటర్ల వేగంతో 1,600 కిలోమీటర్ల దూరాన్ని కారు చేరుకుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top