పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిపోయిన పర్యటనలు
గ్రేటర్‌లో 75 శాతం బుకింగ్‌లు రద్దు
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్యాటక రంగం కుదేలైంది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులు, విదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని అనిశ్చితి దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలు భారీగా నిలిచిపోయాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 75 శాతం బుకింగ్‌లు రద్దయినట్లు గ్రేటర్‌లోని ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్‌లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగంలో కోవిడ్ నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు చెబుతున్నారు.
3 వేల సంస్థలపై యుద్ధ ప్రభావం..
సాధారణంగా వేసవిలో ఏప్రిల్, మే నెలల్లో నగరం నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సైతం సందర్శిస్తారు. ఈ వేసవి ఆరంభంతోనే యుద్ధం ప్రారంభం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పర్యాటక రంగంపై ఆధారపడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 3 వేల సంస్థలపై యుద్ధం ప్రభావం చూపినట్లు సికింద్రాబాద్‌కు చెందిన వాల్మీకి పర్యాటక సంస్థ ప్రతినిధి హరికిషన్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణ రోజుల్లో 20,000 మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా, గత నెల రోజులుగా ఆ సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు అంచనా.
ఫ్లైట్స్ రద్దయితేనే రీఫండ్..
ప్రస్తుత పరిణాల దృష్ట్యా పశ్చిమాసియా వైపే కాకుండా ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లు ట్రావెల్స్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ స్వయంగా ఫ్లైట్‌లను రద్దు చేసినప్పుడు మాత్రమే 100 శాతం టికెట్ డబ్బులు రీఫండ్ అవుతున్నాయి. ప్రయాణికులే టూర్‌ను రద్దు చేసుకుంటే టికెట్ చార్జీల్లో 5 శాతం నుంచి 50 శాతం వరకు పెనాల్టీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది.
మరోవైపు విమానయాన రంగంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి.


