ఖానామెట్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలం
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఐటీ హబ్‌కి అత్యంత చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన మీనాక్షి, వాసవి అధీనంలో ఉన్న 4.20 ఎకరాలతో కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1,200 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా.


