ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే.. | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే..

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు వేసుకొని..

కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు

గచ్చిబౌలి: ప్రేమించిన యువతితో 16 రోజుల క్రితమే నిశ్చితార్థమైంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయి (30) నగరంలోని కొండాపూర్‌లో ఉన్న మై హోం మంగళ ‘బి’ బ్లాక్‌లోని 301 ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా యానిమేషన్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మై హోం మంగళలోనే మరో బ్లాక్‌లో ఉండే యువతిని ప్రేమించాడు. మార్చి 22న వైజాగ్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో వెంకటకృష్ణ శ్రీసాయి.. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ్ముడు సాయి పవన్‌కల్యాణ్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు మెసేజ్‌ పెట్టాడు. విషయం తెలిసి.. కాబోయే భార్య వచ్చి ఎంత పిలిచినా డోర్‌ తెరవలేదు. మరో బ్లాక్‌లో నివాసం ఉంటున్న వెంకటకృష్ణ శ్రీసాయి సోదరుడు పవన్‌తో రూమ్‌మేట్‌ విజయ్‌ కలిసి గది తలుపు పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న యువతి గుండెలవిసేలా విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఫైనాన్స్‌లో రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడినట్లు, పెళ్లి ఖర్చులకు ఇబ్బందులెదురయ్యాయని, ఈ క్రమంలోనే వెంకటకృష్ణ శ్రీసాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement