ఎక్కడున్నారు.. ఎందరున్నారు? | - | Sakshi
Sakshi News home page

ఎక్కడున్నారు.. ఎందరున్నారు?

Oct 31 2025 11:43 AM | Updated on Oct 31 2025 11:43 AM

ఎక్కడున్నారు.. ఎందరున్నారు?

ఎక్కడున్నారు.. ఎందరున్నారు?

సిటీ పోలీసులో మ్యాన్‌పవర్‌ ఆడిటింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: మానవ వనరుల కొరత ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఉన్న సిబ్బందినే సద్వినియోగం చేసుకుంటాం. దీనికోసం మ్యాన్‌పవర్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తాం. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ అదే పని చేస్తున్నారు. సిటీ కమిషనరేట్‌లో ఉన్న ఆయా సెక్షన్లతో పాటు అక్కడ పని చేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెలుగులోకి వచ్చిన అంశాలతో కీలక ఆదేశాలు జారీ చేశారు.

కమిషనరేట్‌లో తీవ్ర కొరత..

ప్రస్తుతం నగర పోలీసు విభాగంలో కేటాయించిన పోస్టుల్లో 29 శాతం ఖాళీగానే ఉన్నాయి. దీనికితోడు హోంగార్డుల సేవల్ని వినియోగించాల్సిన చోట కానిస్టేబుళ్లను నియమించారు. మరికొందరు కానిస్టేబుళ్లకు మినిస్టీరియల్‌ స్టాఫ్‌ విధులు అప్పగించడంతో ఆ పని చేయాల్సిన వాళ్లు ఖాళీగా ఉంటున్నారు. అనేక సెక్షన్లలో సక్రమంగా విధులకు హాజరు, సమయపాలన, బాధ్యతల నిర్వహణ, వాల్యూ ఎడిషన్‌ వంటివి లోపించాయని కొత్వాల్‌కు ఫిర్యాదులు అందాయి. గడచిన నెల రోజుల పరిశీలనలోనూ ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పరిస్థితుల్లో మార్పు తీసుకురావడంతో పాటు మ్యాన్‌పవర్‌ ఆడిటింగ్‌లో భాగంగా ఆయన గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్‌లోని ప్రతి ఫ్లోర్‌లో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని, వాటిని కమిషనర్‌ ఛాంబర్‌కు అనుసంధానించాలని స్పష్టం చేశారు.

హోంగార్డులకు బదులు కానిస్టేబుళ్ల వినియోగం..

అధికారులకు సహకరించే, రోజువారీ విధుల్లో హోంగార్డులు ఉండాల్సిన చోట కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కొత్వాల్‌ గుర్తించారు. ఈ కారణంగా వివిధ ఠాణాల్లో పని చేయాల్సిన కానిస్టేబుళ్లు ఎటాచ్‌మెంట్‌పై కమిషనరేట్‌లో ఉంటున్నారు. సంఖ్యాపరంగా ఆ ఠాణాలోనే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి. మరోపక్క అడ్మినిస్ట్రేషన్‌ విధుల్లో కానిస్టేబుళ్లు ఉండటంతో ఆ పని చేయాల్సిన మినిస్టీరియల్‌ స్టాఫ్‌లో కొందరు ఖాళీగా ఉంటున్నారు. దీనికి పరిష్కారంగా సజ్జనర్‌ గురువారం కీలక ఆదేశాలు ఇచ్చారు. 74 పోస్టుల్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లను వారివారి పోస్టింగ్స్‌ ఉన్న ఠాణాలకు తక్షణం పంపాల్సిందిగా స్పష్టం చేశారు. మినిస్టీరియల్‌ బాధ్యతల్లో ఉన్న వారిని దశల వారీగా బదిలీ చేయాలని పేర్కొన్నారు

మినిస్టీరియల్‌ సిబ్బంది సైతం సద్వినియోగం..

● మినిస్టీరియల్‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం, వారి సేవల్ని వినియోగించుకోవడంలోనూ కొన్ని లోపాలు ఉన్నట్లు కొత్వాల్‌ గుర్తించారు. ఎంఏ ఇంగ్లిష్‌ చదివి, మంచి డ్రాఫ్టింగ్‌ నైపుణ్యం ఉన్న వారు సాధారణ ఫైల్స్‌ పర్యవేక్షించే విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్య అభ్యసించిన వారి సేవల్నీ అవసరమైన ప్రాంతాల్లో వినియోగించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, తక్కువ సమయంలో.. తేలిగ్గా ఎక్కువ ఫైల్స్‌ క్లియర్‌ చేయడం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

● నగర వ్యాప్తంగా గస్తీ నిర్వహించే పెట్రోలింగ్‌ వాహనాలన్నీ ప్రధాన కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానించి ఉంటాయి. ఈ విభాగాన్నీ పరిశీలించిన కొత్వాల్‌ సజ్జనర్‌ ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించారు. వీటిని సరిచేయడంతో పాటు గస్తీ నిర్వహించాల్సిన సమయంలో ఏదైనా వాహనం ఆగి ఉంటే వెంటనే అలర్ట్‌ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారుల పని తీరును తానే స్వయంగా మదిస్తూ ఉంటానని, ఉత్తమ పనితీరును ప్రశంసించడంతో పాటు నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. .

మానవ వనరుల సద్వినియోగంపై కొత్వాల్‌ దృష్టి

విభాగాల వారీగా సిబ్బంది వివరాల సేకరణ

వివిధ సెక్షన్లలో ఆకస్మిక తనిఖీలు

కమిషనర్‌ ఛాంబర్‌కు సీసీ కెమెరాల అనుసంధానం

పలు సర్దుబాట్లకు వీసీ సజ్జనర్‌ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement