మైనారిటీలతోనే మెజారిటీ! | - | Sakshi
Sakshi News home page

మైనారిటీలతోనే మెజారిటీ!

Oct 31 2025 11:43 AM | Updated on Oct 31 2025 11:43 AM

మైనారిటీలతోనే మెజారిటీ!

మైనారిటీలతోనే మెజారిటీ!

సాక్షి,సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మైనారిటీలు కీలకపాత్ర పోషించనున్నారు. వీరి మద్దతు ఏ అభ్యర్థికై తే ఉంటుందో వారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే మేరకు నియోజకవర్గంలో మైనారిటీల జనాభా దాదాపు 24 శాతం ఉన్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలూ మైనారిటీ ఓట్లపై కన్నేశాయి. వీరు ఎవరి వైపు ఉంటే వారిదే విజయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. దానిపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల ఫిర్యాదు.. ప్రతిగా కాంగ్రెస్‌ ఎదురుదాడి.. తదితరమైనవి సైతం మైనారిటీ ఓట్ల దృష్టితోనే అని తెలుస్తోంది. పెద్ద నేతలే కాదు.. డివిజన్‌ స్థాయిలో అంతోఇంతో పేరు, పలుకుబడి ఉన్న వారు సైతం ఓట్లను ప్రభావితం చేయగలరనే అభిప్రాయాలున్నాయి. అందుకే అన్నిపార్టీలూ వారి ఓట్లను తమ విజయావకాశాలకు కీలకమైనవిగా భావిస్తున్నాయి.

● ఇటీవలి కాలంలోనే మైనారిటీల్లో మంచి పేరున్న, పేదలకు సహాయం చేస్తారనే గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్‌, తదితర నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమ పార్టీలోని మైనారిటీ నేతల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్‌ వైఫల్యాలు, బీఆర్‌ఎస్‌లో వీరికి జరిగిన మేలు గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతేకాదు, ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌.. తాను ఆటోలో ప్రయాణించిన మష్రత్‌ అలీకి గతంలో రెండు ఆటోలుండగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ రెండు ఆటోలు అమ్మి ఆటోడ్రైవర్‌ కూలీగా పని చేస్తున్నట్లు చెప్పడం తెలిసిందే. ఆటో కార్మికుల్లోనూ మైనారిటీలు గణనీయంగా ఉండటంతో వారు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మైనారీటీల మద్దతు కూడగడుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్‌ఎస్‌ డివిజన్‌ స్థాయి మైనారిటీ నాయకుడు సయ్యద్‌ సిరాజుద్దీన్‌ను కాంగ్రెస్‌ వైపు రప్పించారు. మైనారిటీలపై పార్టీలు చూపుతున్న శ్రద్ధకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ నియోజకవర్గంలో బీసీ జనాభా కూడా ఎక్కువే అయినప్పటికీ, బీసీలు కులాల వారీగా చీలిపోయే అవకాశాలున్నాయి. మైనారిటీల్లోనూ బీసీలున్నారు. ఈ నేపథ్యంలోనే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల ఆశీస్సులున్న అభ్యర్థికే ఓట్ల మెజారిటీ లభిస్తుందని పలువురు భావిస్తున్నారు.

వీరిపైనే ప్రధాన రాజకీయ పార్టీల నజర్‌

ఈ వర్గం ఓట్లతోనే ఆధిక్యతకు అవకాశం

ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ యత్నాలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తాజా చిత్రం

కార్పొరేటర్లుగా వీరే..

నియోజకవర్గంలో ఆరు వార్డులు (కార్పొరేటర్‌ డివిజన్లు) ఉండగా, గత జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికల్లో మూడు డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా గెలిచింది కూడా మైనారిటీ అభ్యర్థులే కావడం గమనార్హం. వీరిలో ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌బేగం, షేక్‌పేట కార్పొరేటర్‌ మహ్మద్‌ రాషేద్‌ ఫరాజుద్దీన్‌లు ఎంఐఎం నుంచి గెలవగా, బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. బాబా ఫసియుద్దీన్‌ గత పాలకమండలిలో డిప్యూటీ మేయర్‌గా పనిచేయడం తెలిసిందే. ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌బేగం మృతితో ఆ వార్దుకు తిరిగి ఎన్నిక జరగక ఇంకా ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనూ నియోజకవర్గంలో మైనారిటల ప్రభావం ఎక్కువేనని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement