 
															ముష్కి చెరువులో ఆక్రమణలు తొలగిస్తాం
హైడ్రా కమిషనర్ రంగనాథ్
మణికొండ: నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల సరిహద్దులోని ముష్కి చెరువులోని ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో చెరువు సమీప ప్రాంతాల నివాసితులు, రైతులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువు పరిరక్షణకు పోరాటం చేస్తున్న నివాసితుల ప్రతినిధి గౌతంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల్లో చెరువును పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారన్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో పట్టా భూములు ఉంటే పరిహారం ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకుని చెరువును రికార్డుల ప్రకారం 60 ఎకరాలలో పునరుద్ధరిస్తామన్నారు. అనంతరం చెరువును సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన తత్త్వ ఆర్గనైజేషన్ వారికి అప్పగిస్తామని, వారు అభివృద్ధి పనులు చేపడతారన్నారు. అంతలోపు చెరువు కట్ట అభివృద్ధి పనులను చేపట్టాలని వారికి కమిషనర్ సూచించారన్నారు. రైతులతో పాటు పక్కనే ఉన్న సంకట హర హనుమాన్ దేవాలయ భూములకు హద్దులు నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ రమాదేవి, ఏఈ నరేంద్ర, రైతులు బట్ట సత్యనారాయణ, బట్టరాజు, నివాసితులు గౌతంరెడ్డి, లింగరాజు, రవీంద్రచారి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
