
మెట్రోకు గుడ్‌బై
ఆ రైల్‌తో అనుబంధానికి బీటలు
సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్‌తో ఎల్‌అండ్‌టీ అనుబంధానికి బీటలు వారాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణ నుంచి వైదొలగనున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ గురువారం మరోసారి స్పష్టంగా తేల్చిచెప్పింది. ఏటేటా పెరుగుతున్న నష్టాలు, ప్రభుత్వం నుంచి ఆశించిన రాయితీలు లభించకపోవడం, ప్రాజెక్టు ప్రారంభమైన కొద్ది కాలానికే కోవిడ్ విజృంభించడం వంటి వివిధ కారణాలతో ఆ సంస్థ సుమారు రూ.5,500 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో మెట్రో భారాన్ని మోయడం తమ వల్ల కాదని ఇప్పటికే పలు దఫాలుగా స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రానికి రాసిన లేఖలోనూ అదే విషయాన్ని వెల్లడించింది. ఈ లేఖలోని వివరాలను ‘సాక్షి’ ముందే వెల్లడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేయడంతో పాటు, ఎల్‌అండ్‌టీతో ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని, ప్రభుత్వంతో మరే విధమైన ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేయడంతో భాగ్యనగర మెట్రోకు ఎల్‌అండ్‌టీకి ఉన్న బంధం ముగిసిపోయింది.
అడుగులు ఇలా..
● హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మెట్రో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధిని, నగరంలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే మెట్రో ఎంతో అవసరమని గుర్తించారు. మెట్రో ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని, దాంతో మిగతా రంగాల్లోనూ నగరంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2007లో కేంద్రం నుంచి ఆమోదం పొంది పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టును ప్రారంభించారు.
● 2010 సెప్టెంబర్‌లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. అయిదేళ్లలో ప్రాజెక్టును నిర్మించి 30 ఏళ్లపాటు రైళ్లను నడపనున్నట్లు ఆ ఒప్పందంలో పేర్కొంది. ఈ లెక్కన 2015 నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి రావాలి. కానీ మరో రెండు సంవత్సరాలు ఆలస్యంగా 2017లో రైళ్లు పట్టాలెక్కాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 9 ఏళ్లుగా ఎల్‌అండ్‌టీయే రైళ్లను నడుపుతోంది. మూడు కారిడార్‌లలో 69 కి.మీ.మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్‌ల మధ్య ప్రతిరోజు 57 రైళ్లు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కొన్ని స్టేషన్‌లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. చాలావరకు వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేకపోవడం, సరైన కనెక్టివిటీ సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి.
మరో 21 ఏళ్లు అవకాశం ఉన్నా..
ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీకి మరో 21 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే మెట్రో కారిడార్‌లకు ఇరువైపులా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చినట్లు అంచనా. పలుచోట్ల మాల్స్ నిర్మించి అద్దెలకు ఇచ్చారు. రాయదుర్గం వద్ద మరో ప్రైవేట్ సంస్థకు సబ్‌లీజ్‌కు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సంస్థ వెదొలగడం ఖరారైన నేపథ్యంలో ఒప్పందంలోని వివిధ అంశాలపై ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
ముందుగానే వెల్లడించిన ‘సాక్షి’
నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ వెనకడుగు
ప్రభుత్వంతో ఒప్పందానికి నిరాకరణ
ముగిసిన 9 ఏళ్ల ఒప్పందం