
మురుగు శుద్ధిలో ముందడుగు
● నేడు 39 అమృత్ ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన
● ఆరు ఎస్టీపీలను ప్రారంభించనున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు మహా హైదరాబాద్ సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మంజూరైన ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో సుమారు 972 ఎమ్మెల్డీల సామర్థ్యంతో నిర్మించే ఎస్టీపీల పనులకు శుక్రవారం అంబర్‌పేట వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరో 6 ఎస్టీపీలను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రెండేళ్లలో నిర్మాణాలు పూర్తయ్యేలా..
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మంజూరు చేసిన 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను రెండు ప్యాకేజీల కింద నిర్మాణాలను పూర్తి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్‌లో.. మిగిలిన రెండు ప్యాకేజీల్లో 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,849.10 కోట్లు. ఇందులో ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ. 2,569.81 కోట్లు. 15ఏళ్ల పాటు నిర్వహణకు రూ. 1,279.29 కోట్లు వెచ్చించనున్నారు. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30శాతం, రాష్ట్రం 30 శాతం, నిర్మాణ సంస్థ 40 శాతం నిధులు సమకూర్చనుంది.
వచ్చే పదేళ్లలో..
రాబోయే పదేళ్లలో మురుగు ఉత్పతి 2,815 ఎమ్మెల్డీ కావచ్చని జలమండలి అంచనా వేస్తోంది. అమృత్ 2.0 కింద 39 ఎస్టీపీలు పూర్తయితే 2,850 ఎమ్మెల్డీలను శుద్ధి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 1950 మిలియన్‌్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 332. 5 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఆరు ఎస్టీపీలు నిర్మాణాలు పూర్తయి అందుబాటులో రానున్నాయి. మిగిలిన రెండు పూర్తయితే దాదాపు 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయవచ్చు. కాగా.. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మూసీ నదిపై సుమారు 62 ఎస్టీపీల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
మూసీ పక్కన అంబర్‌పేట్‌లో ఎస్టీపీ