
బతుకమ్మకుంట ప్రారంభోత్సవం నేడు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంటను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బతుకమ్మ కుంటను ఓ పిక్నిక్ స్పాట్‌గా అభివృద్ధి చేసి.. చుట్టూ పిల్లల ప్లే ఏరియాతో పాటు అనేక ఆకర్షణలు అందుబాటులోకి తెచ్చారు. వృద్ధులు సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వాకింగ్ చేసే వారి కోసం చెరువు చుట్టూ నడక దారి, ఆక్రమణలకు తావు లేకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చెరువు వరద నీటితో నిండు కుండను తలపిస్తుండటంతో బోటు షికారు కూడా అందుబాటులోకి వచ్చింది. బతుకమ్మకుంటను సీఎం నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. బతుకమ్మ ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. ఈ కుంట అభివృద్ధికి హైడ్రా తీసుకున్న చొరవకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.
విద్యుద్దీపాల మధ్య బతుకమ్మ కుంట