
మిత్రులకు బెయిల్ ఇప్పించేందుకు..
సికింద్రాబాద్: తన మిత్రులైన సహ నేరగాళ్లకు బెయిల్ ఇప్పించడం కోసం మహారాష్ట్ర నుంచి నగరానికి వచ్చి..లాడ్జిల్లో బస చేస్తూ..రైళ్లలో ప్రయాణాలు చేస్తూ టార్గెట్ చేసిన ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ఓ ఘరానా నేరగాన్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. లోగడ పలుమార్లు ఈ తరహా నేరాలకు పాల్పడి బెయిల్‌పై బయటకు వచ్చాడు. జీఆర్‌పీ డీఎస్‌పీ ఎస్‌ఎన్ జావెద్, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సాయీశ్వర్‌గౌడ్, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సారస్వత్ తెలిపిన వివరాల ప్రకారం..కర్నాటకకు చెందిన మోతీలాల్ రెడ్డప్ప పవార్ (24) ఉపాధి కోసం మహారాష్ట్రకు వెళ్లాడు. వ్యసనాలకు బానిసైన ఇతడు రైలు ప్రయాణాల్లో 30 నేరాలకు పాల్పడ్డాడు. కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చిన మోతీలాల్ రెడ్డప్ప పవార్‌కు తనతోపాటు మహారాష్ట్రలో జైలుకు వెళ్లిన సహనేరస్తులకు బెయిల్ ఇప్పించడం కోసం డబ్బు అవసరం అయింది. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్న అతడు పలు లాడ్జీల్లో బసచేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దొంగతనాలు చేయడం కోసం పథకం సిద్ధం చేసుకున్నాడు. ఈనెల 17న ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన నిందితుడు రెండు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో తచ్చాడుతుండగా మోతీలాల్ రెడ్డప్ప పవార్‌ను ఈ నెల 21న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర నుంచి వచ్చి నగరంలో
దొంగతనాలు.. పాతనేరస్తుడి అరెస్టు