
మాంసాహారం విషతుల్యమై ఒకరి మృతి!
వనస్థలిపురం: బోనాల పండుగ వేళ ఓ ఇంటిలో విషాదం నెలకొంది. పండుగ సందర్భంగా వండుకున్న మాంసాహారం విషతుల్యమై ఒకరు మృతిచెందగా మరో 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆర్‌టీసీ కాలనీలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఫతేపురానికి చెందిన అనంత శ్రీనివాస్ యాదవ్ ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆర్‌టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బోనాల సందర్భంగా బంధువులను పిలిచి..ఆదివారం రాత్రి బోటి, చికెన్ తీసుకువచ్చి ఇంట్లో వండుకుని కుటుంబ సభ్యులందరూ తిన్నారు. అదేరోజు రాత్రి వీరిలో కొందరికి విరోచనాలు కావడంతో తార్నాకలోని ఆస్పత్రికి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకున్నారు. కాగా మంగళవారం శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చింతలకుంటలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఆదివారం రాత్రి శ్రీనివాస్ తండ్రి మాంసాహారం తినకపోవడంతో అతన్ని మినహాయించి మిగతా అందరూ అస్వస్థతకు గురై ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీనివాస్ తల్లి గౌరమ్మ, చిన్న కూతురు జస్మిత ఐసీయూలో ఉన్నారు. సోమవారమే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్ అక్క చంద్రిక అస్వస్థతకు గురికాగా మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. వండుకున్న మాంసాహారంను ఫ్రిజ్‌లో పెట్టలేదని, ఏం జరిగిందో తెలియడం లేదని శ్రీనివాస్ బావ సంతోష్‌కుమార్ తెలిపారు.
మరో 9 మందికి అస్వస్థత