
మోసపూరిత క్లెయిమ్‌లపై క్రిమినల్ చర్యలు
హిమాయత్‌నగర్ : పన్ను చెల్లింపుదారులు ఆదాయపు రిటర్న్ క్లెయిమ్‌లను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని రాష్ట్ర ఆదాయపు పన్ను(దర్యాప్తు) విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్ రాజేశ్వర్ బయ్వార్ అన్నారు. మంగళవారం ఆనంద్ రాజేశ్వర్, ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజగోపాల్ శర్మలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆనంద్ రాజేశ్వర్ మాట్లాడుతూ తప్పుడు తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేయడం, రీఫండ్‌ల కోసం తప్పుడు పత్రాలు దాఖలు చేయడం శిక్షార్హమైన నేరమని పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఆదాయపు పన్ను సెక్షన్లు 10(13ఏ), 80జిజిసి, 80ఈ, 80డీ, 80ఈఈ, 80ఈఈబి, 80జి, 80జిజిఎ, 80 డీడీబీ కింద తగ్గింపుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుందన్నారు. ఐటీఆర్ తప్పుడు క్లెయిమ్‌లు శిక్షార్హమైన నేరమని ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సీఏలు చంద్రశేఖర్ వేముల, పీవీ నారాయణ రావు, ఆశిష్ జోషి, అజయ్, సోమేశ్వర్, రామ్‌దేవ్ భుతాదా, హితేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.