
ఉస్మాన్‌సాగర్‌కు తప్పిన మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాలకు తాగునీరు అందించే ఉస్మాన్‌సాగర్‌కు (గండిపేట చెరువు) మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చే మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. వరద సమయంలో ఆ నీరు గండిపేటకు చేరేలా ఉండే రెండు గేట్లు శిథిలం కావడం, దీనిపై మీడియాలో వచ్చిన కథనాలతో హైడ్రా ఈ చర్య తీసుకుంది. శిథిలమైన గేట్లను పరిశీలించడానికి గతంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అక్కడ పరిస్థితులు చూసిన ఆయన తక్షణం మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. దీంతో శిథిలమైన రెండు గేట్ల స్థానంలో కొత్తవి అమర్చారు. బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త కొంతమేర తొలగించి మురుగు నీరు ముందుకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ నాలా ఒకప్పుడు కేవలం వరద కాలువగా ఉండేది. శంకర్‌పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు వర్షపు నీటిని తీసుకెళ్లిన చరిత్ర ఈ నాలాకు ఉంది. ప్రస్తుతం నాలాకు ఎగువన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు, రిసార్టుల నుంచి బయటకు వస్తున్న మురుగు నీరు దీని ద్వారానే ప్రవహిస్తోంది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే ప్రయోజనాలుంటాయని, హుస్సేన్‌సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువెళ్లే ఏకై క నాలా ఇదేనని స్థానికులు చెబుతున్నారు. దీంతో నాలా పునరుద్ధరణపైనా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది.
బుల్కాపూర్ నాలాకు ‘హైడ్రా‘ గేట్లు
దీని పునరుద్ధరణపై అధికారుల దృష్టి