
తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ఆరా
కొత్తగా భూసేకరణ బదులు రీజినల్ రింగురోడ్డుకు ప్రతిపాదించిన భూమిలో వాటా కోసం ప్రతిపాదన
30 మీటర్లు ఔటర్ రింగు రైలుకు ఇవ్వాలని సూచన
మిగతా 70 మీటర్లలో రింగురోడ్డు అసాధ్యమంటున్న ఎన్‌హెచ్‌ఏఐ
సాధ్యం కావాలంటే రోడ్డు డిజైన్‌ను పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి
అందుకు రూ.10 వేల కోట్లకు పైగా అదనపు వ్యయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు–ఔటర్ రింగు రైలు.. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూమిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియని సంకట పరిస్థితి కేంద్రానికి ఎదురైంది. రీజినల్ రింగురోడ్డుకు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. రీజినల్ రింగురోడ్డును ఆససరా చేసుకొని దాని చుట్టూ నిర్మించాల్సిన ఔటర్ రింగురైలుకు ఇప్పటి వరకు భూసేకరణ జరగలేదు. రీజినల్ రింగురోడ్డుకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిస్తూ గత జనవరిలోనే రైల్వే శాఖ అలైన్‌మెంట్‌ను సూత్రప్రాయంగా ఖరారు చేసింది.
రింగురోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఖరారు కానందున, ఔటర్ రింగురైలు అలైన్‌మెంట్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఇప్పుడే తెలియని పరిస్థితి నెలకొంది. దక్షిణ రింగు అలైన్‌మెంట్ ఖరారైతే తప్ప ఔటర్ రింగురైలు నిడివి తేలదు. ఇది ఇలా ఉంటే..అసలు సమస్య ఇప్పుడు నెలకొంది. ఔటర్ రింగురైలుకు భూసేకరణే పెద్ద సమస్యగా మారింది. రీజినల్ రింగురోడ్డు కోసం భూసేకరణ చేస్తున్నప్పుడే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
ఈ తరుణంలో కొత్తగా ఔటర్ రింగురైలు కోసం భూములు సేకరించటం అతిపెద్ద సవాల్‌గా మారింది. భూసేకరణకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని రైతులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయం నేరుగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ దృష్టికి వెళ్లింది. జనం అడ్డుకుంటే ఆ ప్రాజెక్టే నిలిచిపోయే పరిస్థితి ఉందని అధికారుల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రీజినల్ రింగురోడ్డు కోసం సేకరించిన భూమిలోనే రైల్వే లైన్‌కు కొంత భూమిని కేటాయించాలన్న అంశాన్ని రైల్వే శాఖ ప్రతిపాదిస్తోంది.
70 మీటర్లు రింగురోడ్డుకు.. 30 మీటర్లు రైల్వే లైన్‌కు..
రీజినల్ రింగురోడ్డును ఎనిమిది లేన్లుగా నిర్మించాల్సి ఉన్నందున.. వంద మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తున్నారు. ఇందులో రైల్వేకు 30 మీటర్లు ఇవ్వాల్సి వస్తే, మిగతా 70 మీటర్లలో రోడ్డు నిర్మాణం ఇబ్బందిగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అంటోంది. ఒక్కో లేన్ 3.75 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఎనిమిది వరుసలకు గాను 30 మీటర్ల వెడల్పుతో భూమి అవసరం. మధ్యలో సెంట్రల్ మీడియన్‌ను 15 మీటర్లుగా ఖరారు చేశారు. స్తంభాల కోసం అటూఇటూ కలిపి 5 మీటర్లు అవసరం. వెరసి 50 మీటర్లు రోడ్డుకు అసరమవుతుంది. ఇక, రింగురోడ్డు 6 మీటర్ల ఎత్తుతో నిర్మితమవుతుంది.
అప్పుడు అంత ఎత్తు నుంచి కట్టను వాలుగా నిర్మిస్తారు. ఎత్తు ఎంత ఉంటే దానికి రెట్టింపు వాలు (స్లోప్) అవసరం. అంటే ఒక్కో వైపు 12 మీటర్ల స్లోప్.. రెండు వైపులా కలిపి 24 మీటర్ల స్థలం స్లోప్‌నకు కావాల్సి ఉంటుంది. ఎక్కడైనా రోడ్డు ఎత్తు మరింత పెరిగితే, అంతమేర స్లోప్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ స్థలం కావాలి. వెరసి 70 మీటర్ల స్థలం సరిపోదు. దీనికి మిగిలిన ఒకేఒక పరిష్కారం.. స్లోప్‌గా రోడ్డు కట్టను నిర్మించకుండా, రిటైనింగ్ వాల్ పద్ధతిలో స్లోప్ లేకుండా వంతెన తరహాలో నిర్మించాల్సి ఉంటుంది. అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రోడ్డు నిడివి యావత్తు వంతెన తరహాలో ఉంటుంది. అది మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కనీసం 20 శాతానికి పెంచుతుంది. అప్పుడు రీజినల్ రింగురోడ్డు వ్యయం కనీసం రూ.8 వేల కోట్లు మేర పెరుగుతుంది.
క్రాసింగ్స్ ఎలా..?
ఇటు రోడ్డు–అటు రైలు కలిసి సాగితే.. వేర్వేరు ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులతో రీజినల్ రింగురోడ్డుకు అనుసంధానం చేయాల్సిన ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ అడ్డుగా మారుతుంది. రైల్వే లైన్లను ఔటర్ రింగురైలుతో అనుసంధానించే చోట్ల రోడ్డు అడ్డుగా మారుతుంది. అలాంటి చోట్ల రోడ్డు–రైలు ఏదో ఒకటి ఎలివేటెడ్ పద్ధతిలో నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం మరో రూ.2 వేల కోట్లకుపైగా అదనపు వ్యయం అవుతుంది.
ఇక 25కుపైగా రైల్వే స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుంది. ఊళ్లున్న చోటనే స్టేషన్లు ఉండాలి కాబట్టి ఆయా ప్రాంతాల్లో అదనంగా భూమిని సేకరించాల్సిందే. దానికీ అదనపు ఖర్చు తప్పదు. వెరసి, భూసేకరణ కంటే ఈ అదనపు ఖర్చు ఎక్కువ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ సవాల్‌ను అధిగమించటం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగానే మారింది. భూ పరిహారం మొత్తాన్ని భారీగా పెంచి ఇవ్వటం ద్వారా భూసేకరణకు ప్రజలను ఒప్పించి పూర్తి రైల్వేలైన్‌కు కావాల్సిన భూమిని సేకరిస్తారా, రిండురోడ్డుకు సేకరించిన భూమిలోనే భారీ వ్యయం చేసి రైల్వే లైనుకు సర్దుబాటు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.