
శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం ఏకకాలంలో చేపట్టండి
బందరు పోర్టు నుంచి హైదరాబాద్‌కు గ్రీన్‌ఫీల్డ్ హైవే కావాలి
సెమీకండక్టర్, రక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతివ్వండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, ప్రాంతీయ రింగ్‌రోడ్డు, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లిన అంశాలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2
మెట్రో రైలు ఫేజ్–1లో 69 కిలోమీటర్ల నిడివితో మూడు కారిడార్లు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఫేజ్–2 కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాం. ఇందులో 76.4 కిలోమీటర్ల నిడివితో 5 కారిడార్లు ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ఈ జాయింట్ వెంచర్ మొత్తం ఖర్చు రూ.24,269 కోట్లు. ఇందులో కేంద్రం వాటా 18 శాతం (రూ.4,230 కోట్లు).
రాష్ట్ర వాటా 30 శాతం (రూ.7,313 కోట్లు). రుణం 48 శాతం (రూ.11,693 కోట్లు). 2024 అక్టోబర్‌లో చెన్నై మెట్రో ఫేజ్–2కు రూ.63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్–2 కు రూ.14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూరు మెట్రో ఫేజ్–3కి రూ.15,611 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2పై కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటికి సమాధానాలిచ్చాం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలి.
ప్రాంతీయ రింగ్ రోడ్డు
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో కలిపి ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్‌ఆర్‌ఆర్)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ మధ్య 161వ నంబర్ జాతీయ రహదారి ఉండగా.. దక్షిణ భాగం చౌటుప్పల్ – ఆమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి మధ్య ఎన్‌హెచ్ 65 ఉంది. ఉత్తర భాగం కోసం భూసేకరణ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది.
90 శాతం భూముల ప్రపోజల్స్ ఎన్‌హెచ్‌ఏఐకి పంపించాం. ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు కూడా పిలిచింది. అయితే, ఈ భాగానికి అవసరమైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం ఇవ్వాలి. దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతోపాటే చేపట్టాలి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేయాలి. ఉత్తరభాగంలాగే దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రింగ్ రైల్వే ప్రాజెక్టు.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కి.మీ. పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించాం. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుంది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరు చేయండి. దేశం మొత్తం ఔషధాలలో తెలంగాణే 35 శాతం ఉత్పత్తి చేస్తోంది. బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుంది. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుంది.
సెమీకండక్టర్ రంగానికి మద్దతివ్వండి
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోంది. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్‌కాం, ఎన్‌విడియా వంటి ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఉన్నాయి. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఐఎస్‌ఎం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుంది.
రక్షణరంగ ప్రాజెక్టులకు తోడ్పాటునివ్వండి
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో, ఎంఎస్‌ఎంఈల్లో ఉన్న రక్షణరంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ, డిఫెన్స్ పీఎస్‌యూ లు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయి. వాటి పరిధిలో వె య్యికి పైగా ఎంఎస్‌ఎంఈలు, స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయి. లాక్‌హీడ్ మారి్టన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్, హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపుతున్నాయి. రక్షణ రంగంలోని జేవీలు, ఆఫ్‌సెట్‌లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరం. వీటికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలి.
హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్
రక్షణ రంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్‌కు లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వహించాలి.
మరో 800 ఎలక్ట్రిక్ బస్సులివ్వండి
కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు మరో 800 ఎలక్ట్రిక్ బ స్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు రెండువేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు చేపట్టిన రెట్రోఫిట్టెడ్ సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు.