ఫ్యూచర్ సిటీ పేరిట నకి‘లీలలు’
ఫేక్ వెబ్‌సైట్ సృష్టించిన కేటుగాళ్లు
● ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలంటూ ప్రచారం
● అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీని సైతం కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. ఫ్యూచర్‌సిటీటీజీ.ఇన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఫోర్త్ సిటీకి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఫ్యూచర్ సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది. ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. 56 పోస్టులను ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలనే నియామకాలు చేపడుతున్నట్లు నిరుద్యోగులు, యువతకు వల వేస్తున్నారు. ఈ నకిలీ ప్రకటనలు, ఉద్యోగ భర్తీ ప్రక్రియలపై నిరుద్యోగులు, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్‌లో ఫోర్త్ సిటీ అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది సర్కార్ లక్ష్యం. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దీని పరిధిలోకి మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోర్త్ సిటీలో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, నీటి సరఫరా, సౌర విద్యుత్ పార్క్ అభివృద్ధి ఇలా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సైతం ఈ నకిలీ వెబ్‌సైట్‌లో ఆహ్వానించడం గమనార్హం.
ఫ్యూచర్ సిటీ పేరిట నకి‘లీలలు’


