నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు! | - | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు!

Mar 5 2025 8:50 AM | Updated on Mar 5 2025 8:50 AM

నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు!

నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు!

సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్‌, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్‌ కుమార్‌, అలోక్‌ కుమార్‌ దేశ సరిహద్దులు దాటి నేపాల్‌ పారిపోయినట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 16 ఈ రెండు నేరాలకు పాల్పడిన బీహారీ ద్వయం పశ్చిమ బెంగాల్‌ మీదుగా నేపాల్‌ వెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నేరచరితులైన వీళ్లు గతంలోనూ ఇలా దేశం దాటి, పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చారని అధికారులు చెప్తున్నారు.

మీర్జాపూర్‌ నుంచి మారణకాండ...

బిహార్‌లోని వైశాలి జిల్లా ఫతేపూర్‌ పుల్వారియాకు చెందిన అమన్‌ కుమార్‌, అలోక్‌ కుమార్‌, చందన్‌ కుమార్‌, రాజీవ్‌ సాహ్నిలతో ఈ ముఠా ఏర్పడింది. వాహనాలపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకోవడం వీరి నైజం. అలోక్‌ కుమార్‌ నేతృత్వంలో సాగే ఈ ముఠా 2023 సెప్టెంబర్‌ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరింది. సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. యూపీ పోలీసులు దాదాపు ఏడాది పాటు గాలించి గత ఏడాది సెప్టెంబర్‌లో చందన్‌ కుమార్‌ను ముంబైలో, రాజీవ్‌ సాహ్నిని వైశాలిలో పట్టుకున్నారు. అప్పట్లో అమన్‌, అలోక్‌లు వైశాలి జిల్లాలోని మహిసౌర్‌ జనధన్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వెళ్లగా..పోలీసుల కళ్లు గప్పి నేపాల్‌ పారిపోయారు.

బిహార్‌లోనూ అనేక నేరాలు చేసి...

యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత ఈ ద్వయం నేపాల్‌ నుంచి బీహార్‌ చేరుకుంది. అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టింది. ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చి, షెల్డర్‌ తీసుకుంది. అదే నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్‌ సంస్థ ఉద్యోగిని గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించింది. నగరంలో షెల్టర్‌ తీసుకున్న అమన్‌, అలోక్‌ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్‌ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్‌ ట్రావెల్స్‌ నుంచి ప్రైవేట్‌ బస్సులో రాయ్‌పూర్‌ వెళ్లేందుకు అమిత్‌కుమార్‌ పేరుతో టిక్కెట్‌ బుక్‌ చేసుకుంది. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్‌ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి.

ఆధారాలు దొరక్కుండా ప్రయాణాలు...

అఫ్జల్‌గంజ్‌ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్‌ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్‌ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చైన్నె వెళ్లారు. చైన్నె నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్‌ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే యూపీ పోలీసులు రూ.2 లక్షలు, కర్నాటక పోలీసులు రూ.5 లక్షలు రివార్డు ప్రకటించారు. త్వరలో హైదరాబాద్‌ అధికారులూ రివార్డు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అమన్‌ కుమార్‌

జనవరిలో బీదర్‌, అఫ్జల్‌గంజ్‌ల్లో కాల్పులు

చైన్నె మీదుగా పశ్చిమ బెంగాల్‌కు బిహారీలు

అక్కడి నుంచి దేశ సరిహద్దులు దాటిన వైనం

గతంలోనూ ఇలా చేసిన అమన్‌, అలోక్‌ ద్వయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement