సాక్షి ప్రతినిధి, వరంగల్ :
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం, టెండర్ల వ్యవహారం శుక్రవారం వరంగల్ నగరంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘కుడా’భూముల వేలంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తామని బీఆర్‌ఎస్ ప్రకటించగా, దీనికి ప్రతిగా కుడా చైర్మ న్ వెంకట్రాంరెడ్డి అదే ఆలయంలో ప్రమాణం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల కార్యక్రమాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో భద్రకాళి ఆలయం వద్ద హైడ్రామా నెలకొంది.
చన్నీటి స్నానం.. అరెస్టుతో హైడ్రామా
శుక్రవారం ఉదయం భద్రకాళి ఆలయానికి చేరుకున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ఆలయ సమీపంలో చన్నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాదవరెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంలోనుంచే మర్రి యాదవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సత్యానికి భయపడి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆలయంలో ప్రమాణం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
విమర్శలు, ప్రతివిమర్శలు..
● కుడా లేఅవుట్, టెండర్ల వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని, ఫార్మసిస్టులు, వైద్యులు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్ ద్వారా రూ.60 నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రమాణం చేసేందుకు వచ్చిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి పిలుపు ఇవ్వని తననూ పోలీసులు నిర్బంధించారని విమర్శించారు.
● బీఆర్‌ఎస్ నేతల విమర్శలపై స్పందించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కుడాలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలసముద్రంలో రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై కుడా నిధుల వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
‘కుడా’ భూముల వేలం, టెండర్లపై దుమారం
అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్.. జరగలేదని కాంగ్రెస్ పరస్పర సవాళ్లు
చన్నీటి స్నానాలు, పసుపు నీళ్లతో శుద్ధి..
అరెస్టులు, ఆందోళనలు
వరుస పరిణామాలతో భద్రకాళి దేవస్థానం వద్ద హైడ్రామా
చన్నీటి స్నానం చేస్తున్న కుడా
మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి


