కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా.. బ్యాకప్ లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. చూసి తరించేందుకు తప్ప ఏదైనా ఘటన జరిగితే రికార్డు చేసి తెలిపేలా కెమెరాలకు బ్యాకప్ లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీ రోజు జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు భూక్రయవిక్రయదారులు, కార్యాలయ సిబ్బంది కార్యకలాపాలు రికార్డు చేయడంతోపాటు అక్రమాలను నిఘా నేత్రం గమనిస్తుందనే భయం ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావుండదు.
అన్ని కెమెరాలూ అంతే..
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కెమెరా కనిపెడుతూ మానిటర్‌లో డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ, సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా ఉన్న రెండు సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అవి పని చేసినా రికార్డు కాదు.. దీంతో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మళ్లీ ఫుటేజీ చూసుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ, రికార్డు సెక్షన్‌లోనూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో భూక్రయవిక్రయదారులు తమను వేధిస్తున్న వారిని పట్టించేందుకు తోడ్పడని సీసీ కెమెరాలు ఉన్నా.. లేకున్నా ఒకటే కదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు సెక్షన్‌లో దస్త్రాలకు భద్రత కరువు
ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని నానుడి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన, ఏళ్లనాటి దస్త్రాలను భద్రపర్చే రికార్డు సెక్షన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ, వీటికి బ్యాకప్ లేక దస్త్రాలకు భద్రత లేకుండాపోయింది. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు బ్యాకప్ ఏర్పాటు చేయాలని భూక్రయవిక్రయదారులు కోరుతున్నారు.
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలకు లేని బ్యాకప్
రికార్డు సెక్షన్‌లోని దస్త్రాలకు
భద్రత కరువు


