వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో ఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బీఎల్‌ఓలు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇళ్లను స్వయంగా సందర్శించి ఓటరు వివరాలు నమోదు చేయాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం సర్ పూర్తయ్యింది, ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో ఈఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
ట్రాన్స్‌జెండర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గంలో కొందరు ట్రానన్స్‌జెండర్లు సర్ నమోదుకు ముందుకు రావడంలో సంకోచిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రతి పౌరుడికి ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ట్రాన్‌న్స్‌జెండర్లు కూడా దేశ పౌరులేనని, వారికి సర్‌పై అవగాహన కల్పించి వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు పి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.


