వాజేడు : మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో గల బొగత జలపాతానికి శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. బొగత నుంచి జాలువారుతున్న జలధారలను తిలకిస్తూ సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని సందడి చేశారు. చాలా రోజుల తర్వాత బొగత జలపాతంలో జలధార కనిపించడంతో మంత్ర ముగ్ధులయ్యారు.
గోదావరికి ప్రాణహిత వరద
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదికి ప్రాణహిత గుండా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు చేరగా కాళేశ్వరం వద్ద 4.885 మీటర్ల ఎత్తులో నీటి మట్టం దిగువకు ప్రవహిస్తోంది. దిగువన ఉన్న అంబట్‌పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 19వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరాగా, మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు ఔట్ ఫ్లోను అదే స్థాయిలో తరలిస్తున్నారు.


