హన్మకొండ : విద్యుత్ బస్సుల భద్రతపై జేబీఎం సంస్థ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లేనా అనే సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. జేబీఎం బస్సులతో ప్రయాణికుల భద్రతకు ప్రమాదం పొంచిఉందని భావించిన టీజీఎస్ ఆర్టీసీ ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులు నిలిపివేసింది. జేబీఎం నుంచి ఏ హామీ లభించిందో ఏమో కానీ.. శుక్రవారం వరంగల్ రీజియన్‌లో జేబీఎం విద్యుత్ బస్సులు రోడ్డెక్కాయి. 50 బస్సులను సాంకేతికంగా సరిదిద్దామని, వాటిని నడించాలని జేబీఎం సంస్థ ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరిందని, ఈ మేరకు 45 బస్సులు నడిపామని అధికారులు తెలిపారు. జేబీఎం బస్సుల ప్రమాదాలకు కారణాలేమిటి, భవిష్యత్‌లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, తీసుకునే చర్యలు ఏమిటో స్పష్టంగా తెలియాల్సిన అవసరముందని ప్రయాణికులు అంటున్నారు. విద్యుత్ బస్సులకు బ్యాటరీల నుంచి పొగలు రావడం క్రమంగా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే భవిష్యత్‌లో ప్రమాదం జరిగితే అబాసుపాలు కావాల్సి వస్తోందని భావించిన ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అయితే ఒక్క రోజు బస్సుల నిలిపివేతతో సమస్య పరిష్కారమైనట్లేనేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గందరగోళంలో కార్మికులు
సాంకేతిక నిపుణులు బ్యాటరీల వద్ద ఉత్పన్నమయ్యే సమస్యను గుర్తించి వాటిని సరిచేస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరంగల్–2లోని 115 విద్యుత్ బస్సులు నిలిచిపోవడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు. బస్సులు ఎన్ని రోజులు నిలిపివేస్తారో తెలియక వరంగల్ రీజినల్ అధికారులు కండక్టర్లను సర్దుబాటు చేయగా అభ్యంతరం, నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత గతంలో ఈ డిపోలో నడిచి సర్దుబాటు చేసిన బస్సులను తిరిగి డిపోనకు తెప్పించాలని, తమను ఇతర డిపోలకు పంపొద్దని అధికారులను డిమాండ్ చేశారు. ఏది ఏమైనా బస్సులు పునరుద్ధరించడంతో కండక్టర్ల సమస్య సమసిపోయింది.
వరంగల్ రీజియన్‌లో రోడ్డెక్కిన
45 విద్యుత్ బస్సులు
కండక్టర్ల సర్దుబాటు నిలిపివేత


