మాజీ సర్పంచ్‌ ఓటుకే మ్యాపింగ్‌ కరువు | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ ఓటుకే మ్యాపింగ్‌ కరువు

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

లింగాలఘణపురం : భారత ఎన్నికల సంఘం చేపట్టిన గణన పత్రంలో ఓ మాజీ సర్పంచ్‌ ఓటుకే మ్యాపింగ్‌ కరువైంది. దీంతో ఆమె ఓటు హక్కు ఉంటుందా..? లేక కోల్పోతుందా తెలియని అయోమయంలో పడ్డారు. ఆమెతో పాటు అదే గ్రామంలో మరో 80 మందికిపైగా ఇదే పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో 2018లో పిట్టలోనిగూడెం కలుపుకొని ఏనెబావి నూ తన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఆ సమయంలో ఎస్టీ రిజర్వేషన్‌ కావడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో పిట్టలోనిగూడానికి చెందిన గుజులోతు యాదమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2002లో యాదమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఓటరు జాబితాలో ఎవరి పేర్లు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్‌ అయ్యే పరిస్థితి లేదు. 2002లో ఆమెకు సంబంధించిన తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతల ఓటరు వివరాలు ఎక్కడా లేకపోవడంతో వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

పరిశీలించాకే నిర్ణయం..

పిట్టలోనిగూడెంలో సుమారుగా 70 ఇళ్లు ఉండగా 120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 80 మందికి పైగా మ్యాపింగ్‌ అయ్యే పరిస్థితి లేదు. ఈ విషయంపై తహసీల్దార్‌ ఏఈఆర్‌ఓ అండాలును వివరణ కోరగా ఇలాంటి పరిస్థితుల్లో వీరి ఓటు హక్కుపై నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్స్‌ (ఈఆర్‌ఓ) వారికి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సంచార జాతులు కాబట్టి కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వివరించారు.

పిట్టలోనిగూడెంలో

80 మందికి పైగా ఇదే పరిస్థితి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement