హన్మకొండ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ కోరారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని టీజీ ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్‌డీ, కమర్షియల్) శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు వెంటనే పే రివిజన్ కమిటీ వేయాలని, 1999–2004 మధ్య నియామకమైన అర్హులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, శశికుమార్ మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ విభాగంలో అదనపు పోస్టులు మంజూరు చేసి జూనియర్ లైన్‌మెన్, క్షేత్ర స్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. 2019లో నియామకమైన జేఎల్‌ఎం, ఏఎల్‌ఎంలకు బదిలీ అవకాశం కల్పించాలని కోరారు.


