● ఆరు నెలల్లో జ్వరాల విజృంభణ
● జిల్లాలో 4,205 కేసులు నమోదు
● వానాకాలంతో సీజనల్ వ్యాధుల ముప్పు
● అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ఆస్పత్రుల్లో రద్దీ..
వాతావరణంలో మార్పులు, వర్షాకాలం ప్రారంభం కావడంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరేచనాల వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లలోనూ రోగుల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగినా, విరేచనాలు తీవ్రంగా ఉన్నా స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని, యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారంగా వాడొద్దని సూచిస్తున్నారు.
సాక్షి, వరంగల్: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలవరకు సాధారణ జ్వరాలు, విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ వంటి రోగాలు జనాలను బెంబెలెత్తించాయి. ఆరు నెలల్లో అత్యధికంగా 4,205 జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనంతరం అక్యూట్ డయేరియల్ డిసీజ్ (విరేచనాలు) 3,087 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 1,008, టైఫాయిడ్ 218 కేసులు నమోదయ్యాయి. డెంగీ కేసులు ఇప్పటివరకు 27, మలేరియా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైరల్ హెపటైటిస్, హెచ్1ఎన్1, చికున్‌గున్యా వంటి వ్యాధులు నమోదుకాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. సీజన్‌లో కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నీరు నిల్వ లేకుండా చూడాలి..
వైద్యులు సూచించిన ప్రకారం మరిగించిన నీటినే కాచి తాగాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, విరేచనాలు తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి.
– డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
నెల జ్వరాలు విరేచనాలు శ్వాసకోశ టైఫాయిడ్ డెంగీ
ఇన్ఫెక్షన్లు
జనవరి 745 394 257 31 4
ఫిబ్రవరి 637 242 221 26 8
మార్చి 772 426 254 44 8
ఏప్రిల్ 828 584 115 52 2
మే 672 964 92 38 4
జూన్ 551 477 69 27 1
మొత్తం 4,205 3,087 1,008 218 27


