నేటి నుంచి ఆర్ట్‌ చాలెంజ్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్ట్‌ చాలెంజ్‌

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

హన్మకొండ చౌరస్తా: జాతీయ స్థాయి ఆర్ట్‌ చాలెంజ్‌ శుక్రవారం నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాగంటీస్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపకురాలు సాగంటి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం కళా యజ్ఞ స్ఫూర్తితో ‘కళాయజ్ఞ మినీ’ అనే పేరుతో జాతీయ స్థాయిలో 7 అంశాలపై ఆర్ట్‌ చాలెంజ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ప్రతీ రెండు రోజులకు ఓ సారి ఒక సరికొత్త అంశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన చిత్రకారుల చిత్రాలను హైదరాబాద్‌లో ఆగస్టులో జరిగే చిత్ర కళా ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో 50 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొంటున్నారని, వారు వేసిన పెయింటింగ్స్‌ సైతం పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 81436 43337 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

‘కుడా’ భూముల వేలంపై చర్చకు సిద్ధం

నయీంనగర్‌ : ‘కుడా’ భూముల వేలంపై బీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణలకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌ను వెంటబెట్టుకుని రావాలని ప్రతి సవాల్‌ విసురుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఏ గుడికై నా వచ్చి ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ‘కుడా’ నిధుల వినియోగంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైదందని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

అన్నా.. అక్క మెంటార్‌షిప్‌ టీచింగ్‌ ఇంటర్‌ ్న షిప్‌ ప్రారంభం

విద్యారణ్యపురి : ఉన్నత విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అన్నా, అక్క మెంటర్‌షిప్‌–కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థినులు గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రారంభించారు. తొలిదశలో 120మంది విద్యార్థినులు హనుమకొండ జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ అక్షరాస్యత సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్‌ లెర్నింగ్‌ తదితర అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ బి. చంద్రమౌళి తెలిపారు. ఈకార్యక్రమాన్ని నోడల్‌ అధికారులు బి. మాధవి, బి. స్వర్ణలత, డాక్టర్‌ పి. రాజిరెడ్డి సమన్వయం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement