న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జే.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ రిజిస్ట్రార్‌గా వల్లి సుబ్బలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా, సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్‌బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్‌లో 2,364 ఎన్‌ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్‌ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్‌పై ఎలాంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు సీహెచ్.ఉపేందర్, చిట్‌ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులు, న్యాయవాదులున్నారు.
రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, జూలై 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్‌లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 2, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.5,080 ఫీజుతో పాటు నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు (అర్హులైతే), ఎస్సెస్సీ మార్కుల మెమో, పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో వ్యక్తిగతంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌కు హాజరుకావాలని సూచించారు.


