రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

Jul 3 2026 1:34 AM | Updated on Jul 3 2026 1:34 AM

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కాజీపేట అర్బన్‌: రీ సర్వే చేయడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో గురువారం భూ కొలతల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దు రాళ్లు దొరకడం లేదని, సర్వే నంబర్‌ గుర్తించడం, హద్దులు నిర్ణయించడం ద్వారా భూ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఇందుకు రీ సర్వే చక్కటి మార్గం అని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్స్‌, డీజీపీఎస్‌ సాయంతో ఇంచు భూమి కూడా తప్పిపోకుండా సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట మండల తహసీల్దార్‌ సీహెచ్‌.రాజు, సర్వే విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సారంగపాణి, భూములు కొలతల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నూర్‌ సింగ్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రుణాల వసూళ్లపై దృష్టి పెట్టాలి

సీ్త్ర నిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, రుణాలు దుర్వినియోగం చేసిన వారి నుంచి తప్పనిసరిగా రికవరీ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. రుణ వసూళ్లు సీ్త్ర నిధి యాప్‌ ద్వారానే నిర్వహించాలని, అర్హులైన మహిళలకు రుణాల మంజూరులో పురోగతి సాధించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సీ్త్ర నిధి రుణాల మంజూరు, వసూళ్లు, బ్యాంక్‌ అనుసంధానంపై డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, రీజినల్‌ మేనేజర్‌, డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డీపీఎంలు అనిత, రాజేంద్ర ప్రసాద్‌, రీజినల్‌ మేనేజర్‌ రమేశ్‌, ఏపీఎంలు, సీ్త్ర నిధి సిబ్బంది పాల్గొన్నారు.

మెరుగైన పురోగతి సాధించాలి

విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) నమోదు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు, అనుమతి లేని ప్రైవేట్‌ పాఠశాలల మూసివేత, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, శిథిల భవనాల తొలగింపు తదితర అంశాలపై డీఈఓ, ఎంఈఓలతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ట్రెయినీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌ నేత, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, ఎంఈఓలు ఉన్నారు.

అంగన్వాడీ టీచర్‌గా మారిన కలెక్టర్‌

కాజీపేట అర్బన్‌: కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్‌గా మారి ఆటపాటలతో కూడిన విద్యను బోధించారు. ఈ బొమ్మ ఏంటో మీకు తెలుసా? అని అడుగుతూ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు ఆటపాటలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement