వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతీ సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్ప న, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పిల్లలతో మాట్లాడడం, వంటశాల పరిశుభ్రత, స్టాక్ పరిశీలన, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించి ఫొటోలు నివేదికలను అదేరోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
సీపీని కలిసిన వరంగల్ కలెక్టర్
న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు.


