కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈ)లో 2026–2027 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్‌లాల్ బుధవారం తెలిపారు. ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీవరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేయూ దూరవిద్య వెబ్‌సైట్‌లో కోర్సులు, వ్యవధి, విద్యార్హతలు, బోధనామాధ్యమం, అర్హతలు, ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు.
పట్టాలిచ్చే వరకూ పోరాడతాం
న్యూశాయంపేట : పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వామపక్షాల ఆందోళనతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. అంతకుముందు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఏకశిలపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్‌బాషుమియా, సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్, యాదగిరి, రవీందర్, శరత్, కుమారస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.


