కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో రేడియేషన్ సేవలు కరువయ్యాయి. గతేడాది నుంచి పేషంట్లు రేడియేషన్ చికిత్స చేయించుకోలేకపోతున్నారు. దీనికోసం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా పాతకాలం నాటి కోబాల్ట్ పరికరం సోర్స్ లేకపోవడంతో అదిమూలన పడి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రిపేర్ చేసేందుకు టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండగా జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో కోబాల్ట్ క్యాన్సర్ రేడియేషన్ పరికరం మరమ్మతుకు నోచుకోవడం లేదు. అయితే, అధునాతన పరికరంతో రేడియేషన్ సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఒకరు కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల హెచ్‌ఓడీ స్థానంలో ఉన్న ప్రొఫెసర్ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు వెళ్లారు. వైద్య సిబ్బంది కొరత లేకున్నా రేడియేషన్ చికిత్స లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది.
పేషంట్లకు అందుతున్న
కీమోథెరపీ సేవలు..
రేడియేషన్ చికిత్స సౌకర్యం లేకున్నా పేషంట్లకు మెడికల్, కీమోథెరపీ సేవలు రెగ్యులర్‌గా అందుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ల కోసం ప్రత్యేక మెడికల్ సేవలతోపాటు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లకు ఉపశమనం కలుగుతోంది. రేడియేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని పేషంట్లు కోరుతున్నారు.


