● పలు స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు
డోర్నకల్: రైలింజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచాయి. వివరాలిలా ఉన్నాయి. నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(20809) రైలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ సమీపించగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు స్టేషన్‌లో నిలిచింది. దీంతో మనర్‌గుడి–జోద్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్‌ఆర్ బెంగళూరు–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచాయి. భద్రాచలంరోడ్–సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ సమీపంలోని బ్రాంచ్‌లైన్‌లో గంట సేపు నిలవగా, తమిళనాడు, సహారా, ఏపీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మామను బాత్రూంలో నిర్బంధించిన కోడలు
● కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం
నర్సంపేట రూరల్: స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన మామ బయటకు రాకుండా కోడలు గడియపెట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో రంగారెడ్డి నివసిస్తున్నాడు. అయితే, ఆయనకు తన కోడలు డాక్టర్ నవతతో ఆస్తి, కుటుంబ తగాదాలున్నాయి. స్నానానికి బాత్రూంకు ఆ యన వెళ్లగా కోడలు బయట గడియపెట్టి నిర్బంధించింది. దీంతో రెండు గంటలు బయటకు రాలేకపోయాడు. ఆయన అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి రంగారెడ్డిని బాత్రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.
కాశిబుగ్గ: డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 10 మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేశారు. వరంగల్ ఐఎంఏ హాల్‌లో బుధవారం రాత్రి 8 గంటలకు వారిని సన్మానించి ఉత్త మ డాక్టర్ అవార్డులు అందజేయనున్నారు. ఎస్.గోపినాఽథ్, ఎ.అప్ప య్య, బి.రాధాకృష్ణ, ఎం.పుల్లారెడ్డి, జి.చంద్రశేఖర్, బేతి కవిత, పి.అశోక్‌కుమార్, జలగం మాధవి, అజిత్ మహ్మద్, జలగం కావ్యారావు ఉత్తమ డాక్టర్ అవార్డులు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్, ఎంజీఎం ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాంకుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓలు డాక్టర్ ఎస్‌డీ రాంకుమార్, డాక్టర్ బి.సాంబశివరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి పాల్గొంటారు.
మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్: వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. ఏడాది క్రితం నర్సంపేట మున్సిపాలిటీ నుంచి శాశ్వత ఉద్యోగి శ్రుతి వరంగల్ బల్దియాకు బదిలీపై వచ్చి డిప్యుటేషన్‌పై ఇన్‌వార్డు సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఇన్‌వార్డులో నమోదవుతున్న ఫైళ్లను సకాలంలో ఆయా విభాగాలకు పంపించకపోవడంతో అదనపు కమిషన్ ఇసంపల్లి జోనా, సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్.. ఇన్‌వార్డు సెక్షన్ సిబ్బందిని సోమవారం పిలిచి క్లాస్ తీసుకున్నారు. కొత్త కమిషనర్ ఫైళ్లపై సమీక్షిస్తే ఏం సమాధానం చెబుతారని మందలించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రుతి నర్సంపేట మండలంలోని తన ఇంటికి వెళ్లి అల్లోపతి మాత్రలను మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఓ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. తాను మాత్రమే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నానని, అక్కడి నుంచి అంతర్గత బదిలీ చేస్తామంటూ బెదరింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉన్న అల్లోపతి మాత్రలను మింగినట్లు వెల్లడించింది. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్, అటెండర్ చందన తనపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలిసింది. ఈ విషయంపై బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం ఆరా తీశారు. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్ వివరణ సమర్పించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అడిషనల్ జోనా, సూపరింటెండెంట్ ఆనంద్‌ను వివరణ కోరగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం తగదని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించినట్లు తెలిపారు. ఇదేకాకుండా సీ–1 సెక్షన్ సూపరింటెండెంట్ ఆనంద్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఇటీవల తొర్రూరు మున్సిలిటీ హెల్త్ అసిస్టెంట్ వాయిస్ రికార్డు చేసిన సంఘటన వైరల్‌గా మారింది.
మామునూరులో చైన్‌స్నాచింగ్
మామునూరు: మామునూరులో మంగళవారం చైన్‌స్నాచింగ్ జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. మామునూరుకు చెందిన రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ గుండు నాగభూషణం మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నాగభూషణంపై అకస్మికంగా దాడి చేశారు. మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కుని పరారయ్యారు. నాగభూషణం స్వల్పంగా గాయపడగా స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, మరో రెండు రోజుల్లో కుమారుడి వివాహం ఉంది.


