కాశిబుగ్గ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించి, ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి తనిఖీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యుడికి, ఏఎన్‌ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్‌కే ధర్మరాజు, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, లేబర్‌కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు.
మిషన్ ఎయిడ్స్ సురక్షను
విజయవంతం చేయాలి
న్యూశాయంపేట: జాతీయ స్థాయిలో లక్ష్య సాధన దిశగా మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కళను భావితరాలకు అందించాలి
హన్మకొండ కల్చరల్: కళను భావితరాలకు అందించాలని, పేరిణి నాట్యం భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక అమూల్యమైన సంపదని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ నాట్యచార్యులు, పేరిణి ప్రవీణ గజ్జెల రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పేరిణి నాట్య గురుశిష్య పరంపర నాట్యోత్సవం –2026 కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గజ్జెల రంజిత్‌కుమార్, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నాట్య అధ్యాపకురాలు చాతరాజు నవ్యజ, పేరిణి కళాకారులు గడ్డం విద్యాశ్రీ, తోడెన్గా సంతోష్, తొడసం గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 18న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నాట్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


