సంవత్సరం
వరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు.
పెరుగుతున్న కేసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది.
‘భరోసా’ఇస్తూ..
కమిషనరేట్‌లోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు.
కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు
పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చెప్పారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది.
మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు.
తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు
అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం
శిక్షలు పడుతున్నా తగ్గని ఘోరాలు
బాధితులకు అండగా భరోసా కేంద్రం


