కేయూ క్యాంపస్: పీహెచ్‌డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్‌పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు.
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా జి.ముకుందారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు డీఎఫ్‌ఓగా విధులు నిర్వహించిన లావణ్యను మహబూబాబాద్ డీఎఫ్‌ఓగా బదిలీ చేశారు. హనుమకొండ జిల్లా డీఎఫ్‌ఓగా ముకుందారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
నయీంనగర్ : రోడ్లు, భవనాల శాఖ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.సురేశ్‌బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనలు పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకున్నారు.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సందర్శించారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన వెంటన ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఖిలా వరంగల్: జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,671 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు (పీపీబీఎస్) పథకానికి అనుసంధానం చేయబడ్డాయన్నారు. రైతులు తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను జూలై 5వ తేదీలోపు అందించాలన్నారు.
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో పైచదువుల కోసం అందించే సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు.


