వరంగల్ అర్బన్ : వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జీడబ్ల్యూఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో స్వనిధి మహోత్సవ్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ పరిధిలో సుమారు 48 వేల మంది స్ట్రీట్ వెండర్లు నమోదయ్యారని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఎప్పటికప్పుడు నమోదు అవకాశం కల్పిస్తూ, జాబితాను నిరంతరం నవీకరించాలని అధికారులకు సూచించారు. అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులు, మహిళా సంఘాల వివిధ ప్రదర్శన స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు. అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను సన్మానించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎల్‌డీఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డీఎంసీ రజిత రాణి, టీఎంసీలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించేలా అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రధాన నిర్వాహకుడు నవీన్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్


