పెళ్లయిన వారం రోజులకే.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లయిన వారం రోజులకే..

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

హసన్‌పర్తి: పెళ్లయిన వారం రోజుల్లోనే నవవరుడిని విద్యుత్‌ రూపంలో మృత్యువు కబళించింది. తండ్రిని రక్షించడానికి వెళ్లి తండ్రితో పాటు అతడు మృతిచెందిన విషాద సంఘటన నగరంలోని 55వ డివిజన్‌ భీమారంలో మంగళవారం చోటు చేసుకుంది. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) ఎఫ్‌సీఐలో విధులు నిర్వర్తించి రిటైర్డ్‌ అయ్యాడు. సాంబయ్యకు భార్య రమ, ముగ్గురు కుమారులు శివ కుమార్‌, రంజిత్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌ (32) ఉన్నారు. పెద్ద కుమారుడు శివకుమార్‌ కరోనా సమయంలో మృతి చెందగా.. రంజిత్‌కుమార్‌, శరత్‌కుమార్‌ మాత్రం తండ్రితోనే ఉంటున్నారు. చిన్న కుమారుడు శరత్‌కుమార్‌ సీఏ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

జూన్‌ 24న వివాహం..

శరత్‌కుమార్‌ పెళ్లి జూన్‌ 24న నగరానికి చెందిన ఓ యువతితో ఘనంగా జరిగింది. పెళ్లికి వారం ముందు సెలవు పెట్టి వచ్చినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం భీమారంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో విందు నిర్వహించారు. కాగా, సోమవారం రాత్రి నవ వధువుతో కలిసి శరత్‌కుమార్‌ తన బర్త్‌డే వేడుకలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు.

ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ప్రమాదం..

పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు పడడంతో ఆ ఫ్లెక్సీ తొలగిస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. తండ్రిని రక్షించే క్రమంలో శరత్‌కుమార్‌కు కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతిచెందారు. తండ్రి కొడుకుల మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుదాఘాతంతో వరుడి దుర్మరణం

తండ్రిని కాపాడే క్రమంలో ఇద్దరి మృతి

భీమారంలో విషాదఛాయలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement