ఖిలా వరంగల్: రైలు ప్రయాణాన్ని మరింత సురక్షి తం చేయడానికి, వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవారి ఆగడాలను నియంత్రించడానికి వరంగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థతో చెలగాటమాడినా, రైలు పట్టాలపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసినా, రైలు పట్టాల వెంట పిల్లలు, ప్రయాణికులపై రాళ్లు రువ్వినా, కాలనీల ప్రజలు అజాగ్రత్తగా దాటేందు కు ప్రయత్నించినా, అనవసరంగా అలారం గొలు సు లాగినా, చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తాజాగా వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు.
సిగ్నల్ వ్యవస్థ సున్నితం..
రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నల్ వ్యవస్థ అత్యంత సున్నితమైంది. కొన్నిచోట్లా కొంతమంది ఆకతాయిలు, దుండగులు తెలిసీతెలియక తీగలను ధ్వంసం చేస్తారు. దీంతో లోకో పైలట్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చే ప్రమాదం ఉంది. అలా చేయడం వందలాది మంది ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని అంటున్నారు.
అనవసరంగా చైన్ లాగితే నేరం..
ప్రయాణ సమయంలో రైలును అత్యవసరం వేళ ఆపడానికి ప్రతి బోగీలోనూ అలారం చైన్ ఉంటుంది. దీనిని అనవసరంగా లాగితే జరిమానాతోపాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చర్యలు ఇలా..
రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం తొలిసారి నేరం చేస్తే రూ.వెయ్యి వరకు జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష, పదే పదే అదే తప్పుచేస్తే జరిమానాతోపాటు శిక్ష తీవ్రత పెరుగుతుంది. రైలు ఆగి, కదలడానికి అవసరమైన వ్యయాన్ని వసూలు చేస్తారు. ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే బాధ్యుడిపై అదనపు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తారు.
చైన్ ఎప్పుడు లాగొచ్చంటే..
ప్రయాణికుల్లో ఎవరికై నా గుండెపోటు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఎవరైనా ప్రయాణికుడికి సమీపంలోని ఏదైనా స్టేషన్‌లో తక్షణ చికిత్స, మందులు లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం వంటి వైద్య సాయం అవసరమైనప్పుడు, ప్రయాణికులు ముప్పులో ఉన్నప్పుడు, మంటలు, పేలుళ్లు చెలరేగినప్పుడు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు రైలెక్కేటప్పుడు అది కదిలితే, దొంగతనాలు, దోపిడీదారులు దుశ్చర్యలకు పాల్పడినప్పుడు చైన్ లాగాలి.
రైలు భద్రత అందరి బాధ్యత
పట్టాలపై ఆటలు, పశువులను వదలొద్దు


