సీపీగా ఎన్‌.శ్వేత | - | Sakshi
Sakshi News home page

సీపీగా ఎన్‌.శ్వేత

Jun 30 2026 1:06 AM | Updated on Jun 30 2026 1:06 AM

సీపీగా ఎన్‌.శ్వేత

2012 బ్యాచ్‌ అధికారిణికి వరంగల్‌ కమిషనరేట్‌ బాధ్యతలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు

డీఐజీగా అదనపు బాధ్యతలు

కమిషనరేట్‌కు వస్తున్న తొలి మహిళా అధికారి

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్‌ బదిలీ

క్రైం డీసీపీగా ఎస్పీ(ఎన్‌సీ) కిషన్‌ సింగ్‌ నియామకం

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ కమిషనర్‌ (లాఅండ్‌ఆర్డర్‌)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్‌ సీపీగా పనిచేసిన సన్‌ప్రీత్‌ సింగ్‌ను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగానికి జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణిగా ఎస్పీ, డీసీపీగా పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్‌ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్‌–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

తొలి మహిళా కమిషనర్‌..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్‌ కమిషనరేట్‌కు నియమితులైన తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్‌ రాశారు. 2012 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతీ డివిజన్‌లో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్‌’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళా సిబ్బంది స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా డ్రైవింగ్‌, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు. అదేవిధంగా హైదరాబాద్‌ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ)గా పనిచేశారు. అదేవిధంగా 2021లో సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. తద్వారా సిద్దిపేట కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

16 మాసాలకే సన్‌ప్రీత్‌ సింగ్‌ బదిలీ...

ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న వరంగల్‌ కమిషనరేట్‌కు సీపీగా వచ్చారు. మొదట్లో ప్రజలతో సరిగా గ్రీవెన్స్‌ లేదని, బయట ఎక్కువ కదలికలు లేవన్న ఆరోపణలు తప్ప శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్‌లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది.

క్రైమ్స్‌ డీసీపీగా కిషన్‌ సింగ్‌..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైం డీసీపీగా డి.కిషన్‌ సింగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్‌ విభాగంలో నాన్‌ కేడర్‌ ఎస్పీగా ఉన్నారు. ఇప్పటిదాకా కమిషరేట్‌లో ఖాళీగా ఉన్న క్రైం డీసీపీ పోస్టులో కిషన్‌సింగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement