కాజీపేట అర్బన్: పరిపాలనా విధుల్లో నిత్యం బిజీబిజీగా గడిపే కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం చిన్నారులతో సరదాగా గడిపారు. టీచర్‌గా మారి పాఠాలు చెప్పారు. చిన్నారుల తో ముచ్చటించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ చాహత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ విద్యార్థులతో ముచ్చటించి స్కూల్ యూనిఫాం నచ్చిందా, మీ పేర్లు ఏంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు. తరగతి గదిలో బోర్డుపై ఏబీసీడీలు రాసి విద్యార్థులను ప్రశ్నించారు. ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ విశ్వజ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు.
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త వల్ల పాములు సంచరిస్తున్నట్లు పేషెంట్లు, అటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలో రెండుసార్లు పాములు పిల్లల వార్డులోకి రావడం భయాందోళనకు గురిచేసింది. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం’ వార్తకు అధికారులు స్పందించారు. పాములు పట్టేవారిని పిలిపించారు. ఎంత ప్రయత్నించినా పాము దొరక్కపోవడంతో స్నేక్స్ క్యాచర్ వెనుదిరిగివెళ్లినట్లు తెలుస్తోంది. పిల్లల వార్డుతో పాటు పలు వార్డుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థ్ధాలు, పనికిరాని సామగ్రి ఉండడంతో పాములు తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రం చేయించి, పాముల బెడదను తొలగించాలని అటెండెంట్లు కోరుతున్నారు.


