న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించిన గడువును ఆరు నెలలు పొడిగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. సోమవారం హనుమకొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయా పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అనేక మంది ఓటర్లు ఇప్పటికీ తమ వివరాలు నమోదు చేసుకోలేదని, గ్రామీణ ఓటర్లు వివరాల నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, షేక్ బాషుమియా, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.భిక్షపతి, నాయకులు చుక్కయ్య, దుర్గయ్య, వెంకట్, వీరన్న, టి.భిక్షపతి, అశోక్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.


