‘స్టిక్కర్ల’ పేరిట వసూళ్ల దందా! | - | Sakshi
Sakshi News home page

‘స్టిక్కర్ల’ పేరిట వసూళ్ల దందా!

Jun 30 2026 1:06 AM | Updated on Jun 30 2026 1:06 AM

దందా ఇలా..

ఖిలా వరంగల్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిప్లెక్టివ్‌ స్టిక్కర్లు అతికించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీని పేరుతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వసూళ్లు చేపడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఓనర్లు పేర్కొంటున్నారు.

లారీ ఓనర్లకు భారం..

వాహనాలకు క్యూ ఆర్‌ కోడ్‌తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్‌ కాంట్రా క్టర్‌కు అప్పగించింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు ఫిట్‌నెస్‌కు వచ్చే ప్రతీ వాహనానికి రిప్లెక్టివ్‌ స్టిక్కర్లు అతికిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లభించే స్టిక్కర్లు వేసుకుని వచ్చినా లారీకి కనీసం రూ. 5,500 తీసుకుంటున్నారు. అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6వేలు నుంచి వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.10వేలు వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి..

వరంగల్‌ జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) రంగారావును సోమవారం ‘ది వరంగల్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేముల భూపాల్‌, కోశాధికారి మహమ్మద్‌ జాకీర్‌, సభ్యులు కలిశారు. స్టిక్కర్ల పేరుతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్టిక్కర్ల వసూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతిపత్రం అందజేశారు.

లారీ ఓనర్లపై తీవ్ర ఆర్థిక భారం

చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతి

మార్కెట్‌లో బస్సు, లారీ వంటి వాహనాలకు రేడియం స్టిక్కర్‌ వేస్తే రూ. 300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతోంది. అయితే కార్యాలయాల వద్ద ఉండే కాంట్రాక్టర్‌ స్టిక్కర్‌ తప్పని సరి నిబంధన విధించడంతో అక్రమాలు ఎక్కువయ్యాయి. కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది స్టిక్కర్‌ అతికించాలనుకుంటే వాహన టైర్లను బట్టి సామర్థ్యం మేరకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై వరంగల్‌ జిల్లా రవాణాశాఖ అధికారి రంగారావును వివరణ కోరగా.. రాష్ట్ర స్థాయి నుంచే ఉత్తర్వులు ఉన్నాయని, కాంట్రాక్టర్‌ క్యూఆర్‌ జారీ చేస్తే తాము వాహన సామర్థ్యాన్ని పరీక్షించి ఇక్కడ ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఎంత వసూలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఎక్కువ తీసుకుంటే వాహనదారులు తెలపాలని, అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement