కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశా ల (అటానమస్) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్‌తో కలిసి విడుదల చేశారు. కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, నర్సంపేట డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కళాశాలలోనే అందుబాటులో ఉంచారు.
ఖిలా
వరంగల్: టీఎన్జీఓ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా గాదె వేణుగోపాల్, కార్యదర్శిగా పాలకుర్తి సదానందం, కోశాధికారిగా కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. టీఎన్జీఓ భవనంలో జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్‌కిషన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు శంకేసి రాజేశ్, కార్యవర్గ సభ్యులు వంశీధర్ బాబు, జి.రాజు, రమాదేవి, ఇంద్రాసేనారెడ్డి, రజినీకాంత్, శరత్, రామకృష్ణ, గణేశ్, యూసూఫ్, జ్యోతి, సునీత, పద్మ, కవిత, నాయర్ పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యురిటీ ఏజెన్సీ బాధ్యుడు సాహెబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో డిప్యూటీ వార్డెన్ (మేల్–1), జువాలజీ జూనియర్ లెక్చరర్ (జనరల్–1), కేయూ క్రాస్ రోడ్డులోని వరంగల్ (బాలికలు–1) గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (ఫిమేల్–1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోపు హనుమకొండ పాత ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న సనా సెక్యూరిటీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0870 – 3558539, 81060 78890 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
చెరువులో పడి బాలుడు మృతి
ఖిలా వరంగల్ : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. ఈఘటన కమ్మరికుంటలో చోటు చేసుకుంది. ఏనుమాముల పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబంతో కలిసి ఆరెపల్లి గ్రామంలో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు కామెర శ్రీవిష్ణు సహస్ర సూర్యతేజ (11) సోమవారం సాయంత్రం గ్రామంలోని కుమ్మరికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి అక్క శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు.


