● అందుబాటులో ఆధునిక యంత్రం
● వరంగల్ తపాలా కార్యాలయానికి
చేరిన మెషీన్
ఖిలా వరంగల్ : వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తపాలా కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిలబడాల్సిన అవసరం లేకుండా స్వయంగా పోస్టల్ ఐటమ్స్ (స్పీడ్‌పోస్ట్) బుక్ చేయడం కోసం ఈ యంత్రాలను సిద్ధం చేశారు. ఫలితంగా వినియోగదారులకు నిరీక్షణ తప్పుతుంది. మెరుగైన సేవలు అందుతాయి. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో స్పీడ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని డివిజన్ సూపరింటెండెంట్ బి.రవికుమార్ తెలిపారు.
పోస్టల్ సేవలు సులభం..
వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో పోస్టల్ సేవలు సులభంగా, వేగంగా పంపేందుకు యూజప్ పెండ్లీ ఇంటర్ఫేస్ బుక్ సౌకర్యం కల్పించారు. వస్తువుల బరువును ఆధునిక యంత్రం తూకం వేస్తుంది. అందుకునుగుణంగా కచ్చితమైన చార్జీ లెక్కిస్తుంది. ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే వెసులు బాటు సైతం కల్పించారు. ‘తపాలా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే ట్రాకింగ్ నంబరుతో కూడిన రసీదు వస్తుంది. తపాలా వినియోగదారులు తప్పని సరిగా చిరునామా, పిన్‌కోడ్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది’ అని పోస్టల్ అధికారులు పేర్కొన్నారు.


