వృద్ధులకూ హాస్టల్‌ | - | Sakshi
Sakshi News home page

వృద్ధులకూ హాస్టల్‌

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

గ్రేటర్‌ నగరంలో పెరుగుతున్న కల్చర్‌

సకల వసతులతో హాస్టళ్ల ఏర్పాటు

ఫుల్‌ ఎనర్జిటిక్‌ అవుతున్న వృద్ధులు

సాక్షి, వరంగల్‌: మార్కెట్‌లో బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టల్‌ చూశాం. మారుతున్న కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా ప్రస్తుతం వృద్ధుల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో ఉన్న వారు.. ఉద్యోగరీత్యా బాగోగులు చూసుకోలేనివారు తమ తల్లిదండ్రులను ఈ హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. హాస్టల్‌లో చేరిన వృద్ధులు సైతం తమ ఏజ్‌ గ్రూప్‌ వాళ్లతో ఆనందంగా గడుపుతున్నారు.

ప్రత్యేక శ్రద్ధ..

ఒంటరిగా జీవించలేని వృద్ధులు. నిరంతర వైద్య పర్యవేక్షణ కరువైన వారు. తమ వయసు వారితో ఆనందంగా గడపాలనుకునే వారి కోసం నగరంలో వృద్ధుల హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. కాగా వీటిలో స్టార్‌ హోటల్‌కు తీసిపోకుండా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు. వృద్ధుల ఆరోగ్య దృష్ట్యా ప్రత్యేక ఆహార నియమాలు, నెలనెలా వైద్యపరీక్షలు, నర్సింగ్‌ సేవలు, మందుల పర్యవేక్షణ, అత్యవసర అంబులెన్స్‌, సీసీ కెమెరాల భద్రత, పిల్లలు విదేశాల్లో ఉన్నా వీడియో కాల్‌ ద్వారా ప్రతీ రోజు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు.

ఒంటరితనానికి మందు... కొత్త స్నేహాలు

ఈ హాస్టళ్లలో వృద్ధులు కేవలం గదుల్లోనే ఉండిపోవడం లేదు. ఉదయం యోగా, ధ్యానం, సాయంత్రం నడక, భజనలు, పుస్తక పఠనం, పుట్టినరోజు వేడుకలు, పండుగల సంబరాలు... ఇలా రోజంతా చురుకుగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమలాంటి వయసువారితో గడపడంతో చాలామంది వృద్ధులు మళ్లీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కొందరైతే ‘ఇక్కడికి వచ్చిన తర్వాతే మళ్లీ స్నేహితులు దొరికారు’ అని చెప్పడం ఈ హాస్టళ్ల ప్రత్యేకతను తెలియజేస్తోంది.

సకల వసతులు కల్పిస్తున్నాం..

నేను గర్ల్స్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ అమ్మను తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకున్నాం. అప్పుడే ఆలోచన పుట్టింది వృద్ధుల హాస్టల్‌ ఏర్పాటు చేయాలని. సకల వసతులతో నెలన్నర క్రితం హాస్టల్‌ ఏర్పాటు చేశాం. హెల్త్‌ కండీషన్‌ను బట్టి రూ.10 వేల నుంచి చార్జ్‌ చేస్తున్నాం.

– మెరుగు సంపత్‌,

వృద్ధుల హాస్టల్‌ నిర్వాహకుడు, హనుమకొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement